`అంబాజీపేట మ్యారేజీ బ్యాండు` ట్రైలర్.. సుహాస్ మరోసారి దానిపై పోరాటం..
యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ఇప్పుడు `అంబాజీపేట మ్యారేజీ బ్యాండు` చిత్రంతో వస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరి ఎలా ఉందంటే..
యంగ్ హీరో సుహాస్.. మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఆయన `కలర్ ఫోటో` ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. ఆ మధ్య `రైటర్ పద్మభూషణ్`తో పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో కంటెంట్ ఓరియెంటెడ్ కథతో వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన `అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు` చిత్రంలో నటించారు. దుశ్యంత్ కాటిక నేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుహాస్‌కి జోడీగా తెలుగు అమ్మాయి శివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తుంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. సినిమా త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేసింది యూనిట్. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథగా అనిపిస్తుంది. ఇందులో సుహాస్ పెళ్లిళ్లకి బ్యాండు వాయించే వాడిగా కనిపించాడు. ఓ వైపు కటింగ్ షాప్, మరోవైపు బ్యాండు వాయిస్తుంటాడు. అంబాజీపేట అనే ఊర్లోనే పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. అంతేకాదు ఊరి గొడవల్లో తలదూరుస్తాడు. దీంతో వాళ్లు తిరగబడతారు. ప్రేమ కాస్త పోరాటం లా మారుతుంది. ఊర్లో కులాలు, వర్గాల మధ్య పోరాటంలా మారుతుంది. మరి చివరికి ఏం జరిగింది? ఎవరు విజయం సాధించారు, సుహాస్ ఏం చేశాడనేది కథగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా `కలర్ ఫోటో` తరహాలో సాగుతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, మహాయన మోషన్ పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కుతుంది. బన్నీ వాసు, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల కానుంది.