కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్, హీరోయిన్ అమలాపాల్ 2014లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే వీరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయి. 2017లో అధికారికంగా విడాకులు తీసుకుని ఈ జంట విడిపోయింది. వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో హాట్ టాపిక్. అమలాపాల్ సినిమాల్లో నటించే విషయమై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. 

విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్ హీరోయిన్ గా సినిమాలు కొనసాగించింది. ప్రస్తుతం బోల్డ్ రోల్స్ తో సంచలనం రేపుతోంది. అమలాపాల్ నటించిన 'ఆమె' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో అమలాపాల్ న్యూడ్ సన్నివేశాల్లో నటించింది. 

ఇటీవల విజయ్ తాను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. డాక్టర్ ఐశ్వర్య అనే మహిళతో విజయ్ వివాహం ఈ నెలలో జరగబోతోంది. తాజాగా అమలపాల్ చేసిన ఓ ట్వీట్ పై నెటిజన్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ట్వీట్ తన మాజీ భర్తని ఉద్దేశించే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

పోరాడతాను.. తట్టుకుని నిలబడతాను.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోను. నాపై నాకున్న నమ్మకమే నా బలం.. స్వేచ్ఛగా సంతోషంగా జీవించడం నాకు తెలుసు అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చివర్లో ఆమె చిత్రంలో తన పాత్ర ఇదే అంటూ అమలాపాల్ పేర్కొంది. సినిమా పేరు చెప్పి కవర్ చేసింది కానీ ఈ ట్వీట్ లో ఉన్న కామెంట్స్ మొత్తం తన మాజీ భర్త విజయ్ కు కౌంటర్ ఇచ్చినవే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.