సీనియర్ నటి రాశి Raasi చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై వస్తున్నారు. ఏడేళ్ల తర్వాత తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘రాఘవరెడ్డి’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మూవీ వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అప్పట్లో రాశి ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1988 నుంచి 2017 వరకు వందలాది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాశి.. తాజాగా రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఆమె నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘రాఘవరెడ్డి’ (Raghava Reddy) కి సంబంధించిన రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ‘రాఘవరెడ్డి’ మూవీ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ ఇవ్వాళ జరిగింది.
ఈ చిత్రం శివ కంఠమనేని (Siva Kantamaneni) హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రలో రూపొందుతోంది. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, G.రాంబాబు యాదవ్, R.వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జనవరి 5న విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో రాశి మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా నేను ఇది వరకు ఎన్నో చిత్రాలు చేశాను. ఈ కథ చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. చాలా వేరియేషన్స్ ఈ పాత్రలో ఉంటాయి. తల్లిగా ఈ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. కూతురే ప్రపంచంగా బతికే ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. నేను ఇందులో ఫుల్ సీరియస్ మోడ్‌లోనే ఉంటాను. శివ కంఠమనేని గారు సెట్స్ మీద ఎంతో కూల్‌గా ఉంటారు. జనవరి 5న మా చిత్రం రాబోతోంది. సక్సెస్ మీట్లో మళ్లీ కలుద్దామ’ని అన్నారు.
నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘చెన్నై నుంచి హైద్రాబాద్‌కు ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతున్న టైంలో వెంకటేశ్వరరావు ఎంతో సహకరించారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్‌లోకి వెళ్లారు. శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు అందరూ కలిసి తీసిన చిత్రం రాఘవరెడ్డి అని తెలిపారు. ఇందులో అన్ని రకాల అంశాలు, ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. బాలకృష్ణ తీసిన సింహా టైపులో అనిపించింది. ఎంతో గ్రాండియర్‌గా కనిపించిందని తెలిపారు.
చిన్న చిత్రాల వల్లే ఇండస్ట్రీ బతుకుతోంది. ఇలాంటి చిన్న సినిమాలుంటేనే ఇండస్ట్రీలో నిలబడుతుంది. మీడియా సైతం ఇలాంటి చిన్న మూవీస్‌ను సహకరించాలి. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ఇలాంటి చిత్రాలను విజయవంతం చేయాల’ని కోరుకుంటున్నానన్నారు. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. ‘రాఘవరెడ్డి నాకు నాలుగో చిత్రం. ఇందులో రాశీ గారిది ఒక ట్రాక్. నందితా శ్వేతది ఇంకో ట్రాక్. మూడు ట్రాకులు అద్భుతంగా వచ్చాయి. కామెడీ ట్రాక్ కూడా బాగా వచ్చింది. ఇంటర్వెల్ సీన్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్ ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. అందరూ కంటతడి పెడతారు. నందితా శ్వేతా చాలా చక్కగా నటించారు. మిగతా ఆర్టిస్టులు కూడా అద్భుతంగా నటించారు. మా చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ‘రాఘవ రెడ్డి టైటిల్‌తో యాక్షన్, ఫ్యాక్షన్ అసలు ఏ జానర్ అన్న అనుమానం అందరిలోనూ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తీశాం. ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ దర్శకత్వంలో రాఘవరెడ్డి చిత్రాన్ని చేశాను. క్రిమినాలజీ ప్రొఫెసర్ రాఘవరెడ్డి పాత్రలో శివ కంఠమనేని అద్భుతంగా నటించారు. నిర్మాత శంకర్ రావు, కో ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ‘లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై మీద ఇది మాకు మూడో సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన కథను సంజీవ్ గారు చెప్పిన వెంటనే ఓకే చెప్పాం. యాక్షన్, ఫ్రాక్షన్ కాకుండా యూత్‌ను కట్టిపడేసే ఎంటర్టైన్మెంట్, ఓ సోషల్ మెసెజ్ కూడా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ‘రాఘవ రెడ్డి మంచి విజయాన్ని సాధించాలి. మా శివ కంఠమనేనికి మంచి పేరు రావాల’ని కోరుకున్నాన్నారు.
ఈ చిత్రంలో శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు నటించారు.