కరోనా మరో నటుడు కన్నుమూశాడు. వెబ్‌ సిరీస్‌తో పాపులర్‌ అయిన నటుడు రాహుల్‌ వోహ్రా(35) కరోనాతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. మంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తే బతుకుతానని, నన్ను బతికించండి అంటూ చనిపోవడానికి ముందు ఆయన పెట్టిన హృదయ విదారకమైన పోస్ట్ ఇప్పుడు అందరిని కలచి వేస్తుంది. ఈ నెల 4న ఆయన కరోనాతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని నటుడు రాహుల్ వోహ్రా స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా పేర్లని ట్యాగ్‌ చేశాడు.

కరోనాతో ఆసుపత్రిలో చేరానని, తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని, ఆక్సిజన్‌ లెవల్స్ క్రమక్రమంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. తన బాగోగులు చూసుకునే వాళ్లే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్‌ అందుబాటులో ఉంటే చెప్పండని అభ్యర్థించాడు. ఫ్యామిలీ కూడా టచ్‌లో లేదని, అందుకే ఈ పోస్ట్ పెడుతున్నట్టు వివరించారు. తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం మరో పోస్ట్ పెట్టాడు. `నాకు మంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తే ప్రాణాలతో బయటపడతాను. నిజంగా ఇది జరిగితే నాకు పునర్జన్మ అందించినట్టే` అని ఆవేదన చెందారు. 

అయితే రాహుల్‌ పెట్టిన పోస్ట్ ని చూసిన దర్శకుడు అరవింద్‌ గౌర్‌ మరో ఆసుపత్రికి తరలించారట. కానీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. `మంచి చికిత్స అందిస్తే బతికే అవకాశం ఉందని ఆశపడ్డాడు. వెంటనే అతడిని వేరే ఆస్పత్రికి షిఫ్ట్‌ చేశాం, కానీ బతికించలేకపోయాం` అని ఆయన విచారం వ్యక్తం చేశాడు. కరోనా ఎంతటి దారుణమైన పరిస్థితులు సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాస్త సెలబ్రిటీగా రాణించే వ్యక్తికే ఇలాంటి పరిస్థితి అయితే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించవచ్చు.