నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చెన్నైలోని స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మన్సూర్‌ అలీ ఖాన్‌ మూత్ర పిందాల సమస్యతో బాధపడుతున్నారు. మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ కారణంగానే ఆయన అస్వస్థతకి గురైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకి శస్త్ర చికిత్స చేయనున్నారు. మరోవైపు కరోనా పరీక్ష చేయగా నెగటివ్‌గా తేలింది. 

ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. రీసెంట్‌గా కమెడియన్ వివేక్ చనిపోయినప్పుడు.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కారణంగానే వివేక్ చనిపోయాడని..  ఒక వ్యక్తి ఆరోగ్యస్థితిని పరీక్షించకుండా.. షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఏమీ చేయకుండా వ్యాక్సిన్ ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. మాస్క్ ధరించడం వల్ల మనం వదులుతున్న కార్బన్‌ డైయాక్సైడ్ మనమే పీలుస్తున్నాము.. అలాంటప్పుడు మాస్క్ సేఫ్టీ అని ఎలా చెబుతారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక్ ఔషధాలను వినియోగించకుండా ప్రభుత్వం ఎందుకు ఇంగ్లీష్ మందులను ఇస్తున్నారు? వంటి ప్రశ్నలను ఆయన మీడియా ముఖంగా సంధించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరోవైపు మన్సూర్‌ అలీఖాన్‌ రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటున్నారు.