`ఆర్‌ ఆర్‌ ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌కి పెద్ద షాక్‌ తగిలింది. ఆమెపై కేసు నమోదైంది. ముంబయికి చెందిన కామతిపూరని శాషించిన లేడీ డాన్‌ గంగూబాయ్‌ కుమారుడు కోర్ట్ లో అలియాకి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అలియాభట్‌ హిందీలో `గంగూబాయ్‌ కతియావాడి` చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమిది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించడంతోపాటు, జయంతిలాల్‌ గడాతో కలిసి నిర్మిస్తున్నారు. 

ముంబయి కామతిపూరను శాషించిన లేడీ డాన్‌ గంగూబాయ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో గంగూబాయ్‌గా అలియా భట్‌ నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాని ఆపాలంటూ గంగూబాయ్‌ కుమారుడు బాబూజీ రాజీ షా కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. దర్శక, నిర్మాతలతోపాటు అలియాపై కూడా ఆయన కేసు పెట్టాడు. అలాగే `మాఫియా క్వీన్స్ ఆఫ్‌ ముంబయి` అనే నవల రాసిన రచయిత హుస్సేన్‌ జైదీ పేరు కూడా ఇందులో చేర్చారు. 

తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఉందని, కాబట్టి మాఫియా క్విన్స్ ఆఫ్‌ ముంబపై పుస్తక ప్రచురణతోపాటు గంగూబాయ్ కతియావాడి సినిమాని ఆపాలంటూ కేసు వేశారు బాబూజీ రాజీ షా. దీంతో అలియాకి లేనిపోని చిక్కు వచ్చిపడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అలియా తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్ ఆర్‌ ఆర్‌` చిత్రంలో నటిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా సీత పాత్రలో అలియా కనిపించనుంది. ఇటీవలే ఆమె షూటింగ్‌లో జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. 

మరోవైపు హిందీలో తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. అయితే రణ్‌బీర్‌తో అలియా త్వరలో వివాహం జరుగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. కరోనా లేకపోతే ఇప్పటికే తమ పెళ్ళి జరిగేదని ఇటీవల రణ్‌బీర్‌ వెల్లడించడం హాట్‌ టాపిక్‌గా మారింది.