WTC Final 2023: రన్ మిషీన్ విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా నాలుగో రోజు భారత్ ను ఆదుకున్నాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను బ్రేక్ చేశాడు.  

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా పలు రికార్డులు బ్రేక్ చేశాడు. నాలుగో రోజు ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ఎదుట 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రహానే తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడుతుండటంతో ఈ టెస్టుకు ఐదోరోజున రసవత్తర ముగింపు దక్కనుంది. అయితే నాలుగో రోజు ఆటలో 60 బంతుల్లో 44 పరుగులు చేసిన కోహ్లీ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా ఉంది. 

ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో భారత్ తరఫున రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు సచిన్ 15 ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో 657 పరుగులు చేశాడు. కోహ్లీ (620 పరుగులు) రెండో స్థానంలో ఉండేవాడు. 

డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగులే చేసిన విరాట్.. నాలుగో రోజు బ్యాటింగ్ లో 24 పరుగులు పూర్తిచేయగానే సచిన్ రికార్డు బ్రేక్ అయింది. ఈ జాబితాలో ఆసీస్ దిగ్గజ సారథి రికీ పాంటింగ్.. 18 ఇన్నింగ్స్‌ లలో 731 రన్స్ చేశాడు. నేడు కోహ్లీ మరో 52 పరుగులు చేస్తే పాంటింగ్ రికార్డు బ్రేక్ అవుతుంది. 

Scroll to load tweet…

ఆస్ట్రేలియాపై టెస్టులలో 2 వేలు, ఓవరాల్‌గా ఐదు వేల పరుగులు : 

ఓవల్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ.. ఆస్ట్రేలియాపై టెస్టులలో 14 టెస్టులలో 1,979.. ఓవరాల్‌గా 4,945 రన్స్ చేశాడు. నాలుగో రోజు ఆటతో కోహ్లీ ఈ టెస్టులో ఇప్పటికే 58 పరుగులు చేయడంతో టెస్టులలో 2 వేల పరుగులు, ఓవరాల్ గా ఐదు వేల పరుగులు పూర్తయ్యాయి. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్.. రెండు ఫార్మాట్లలో కలిపి ఆసీస్ పై 6,707 రన్స్ చేశాడు. అంతేగాక డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డులకెక్కాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 296 పరుగులే చేయగలిగింది. దీంతో ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 173 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్.. 8 వికెట్లు కోల్పోయి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్.. నాలుగో రోజు ఆట ముగిసేటప్పటికీ 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 నాటౌట్) అజింక్యా రహానే (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు.