సారాంశం

WTC Final 2023: టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా  డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా బంతితోనే గాక బ్యాట్ తో కూడా   భారత జట్టుకు ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. 

వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా   మరో  అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్   డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న  మ్యాచ్ మూడు రోజు ఆసీస్ బ్యాటర్లు స్మిత్, ట్రావిస్ హెడ్‌లను ఔట్ చేసి  భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు.   గతంలో ఈ రికార్డు దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ పేరిట ఉండేది.  

బిషన్ సింగ్ బేడీ.. భారత్ తరఫున 67 టెస్టులు ఆడి 266 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డును  జడేజా ఇప్పుడు బ్రేక్ చేశాడు. ట్రావిస్ హెడ్ వికెట్ తీయగానే  జడేజా.. టెస్టులలో తన వికెట్ల సంఖ్యను 267 కు పెంచుకున్నాడు.  జడేజాకు డబ్ల్యూటీసీ ఫైనల్ 65వ టెస్టు. 

భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-2 లెఫ్టార్మ్ బౌలర్లు : 

- రవీంద్ర జడేజా : 65 టెస్టులలో 267 వికెట్లు 
- బిషన్ సింగ్ బేడీ : 67 టెస్టులలో 266 వికెట్లు 

 

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ కు ఉంది. హెరాత్.. తన కెరీర్ లో  93 టెస్టులలో 433 వికెట్లు పడగొట్టాడు.  ఈ జాబితాలో కివీస్ మాజీ స్పిన్నర్ డేనియల్ వెటోరి రెండు స్థానంలో ఉండగా జడ్డూ నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ జాబితా ఇదే.. 

- రంగనా హెరాత్ : 93 టెస్టులలో   433 వికెట్లు 
- డేనియల్ వెటోరి : 113 టెస్టులలో  362 వికెట్లు 
- డెరెక్ అండర్‌వుడ్ (ఇంగ్లాండ్) : 86 టెస్టులలో 297 వికెట్లు 
- రవీంద్ర జడేజా : 65 టెస్టులలో 267 వికెట్లు 

ఇక భారత్ తరఫున టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జడేజా   ఏడో స్థానానికి చేరుకున్నాడు.   ఈ జాబితాలో అనిల్ కుంబ్లే  (619) అందరికంటే ముందుండగా  రవిచంద్రన్ అశ్విన్ (474), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) లు జడేజా కంటే ముందున్నారు. వీళ్లంతా కుడి చేతి వాటం బౌలర్లే కావడం గమనార్హం.