WTC Final 2023: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్  చీటింగ్ చేశాడని  టీమిండియా ఫ్యాన్స్ అతడిపై  దుమ్మెత్తిపోస్తున్నారు. 

పదిరోజుల క్రితం వరకూ ఐపీఎల్ - 16 లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించి భారత అభిమానుల అభిమానాన్ని చురగొన్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ఇప్పుడు అదే అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినా దానిని ఔట్ గా ప్రకటించడంతో వివాదం రేగింది. థర్డ్ అంపైర్ కళ్లు మూసుకుని అంపైరింగ్ చేస్తున్నాడని టీమిండియా ఫ్యాన్స్ అతడితో పాటు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని గ్రీన్ పైనా దుమ్మెత్తిపోస్తున్నారు. 

నాలుగో రోజు గ్రీన్ బౌలింగ్ చేసే సమయంలో ఓవల్ లో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు.. ‘కామెరూన్ గ్రీన్ చీటర్’ అంటూ బిగ్గరగా అరిచారు. మరికొంతమంది ‘గలి గలి మే షోర్ హై.. కామెరూన్ గ్రీన్ చోర్ హై’ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

Scroll to load tweet…

గిల్ కూడా.. 

తన ఔట్ పై శుభ్‌మన్ కూడా ట్విటర్ వేదికగా స్పందించాడు. గ్రీన్ క్యాచ్ పడుతున్నప్పుడు బంతి స్పష్టంగా నేలకు తాకుతున్న ఫోటోను షేర్ చేశాడు. భూతద్దంతో పాటు నెత్తి కొట్టుకుంటున్న ఎమోజీని ఇందుకు క్యాప్షన్ గా పెట్టాడు.

Scroll to load tweet…

వీరూ సైతం.. 

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం థర్డ్ అంపైరింగ్ పై తనదైన శైలిలో సెటైర్ వేశాడు. ఓ వ్యక్తికి కళ్లకు గంతలు కట్టి దాగుడు మూతలు ఆడిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇదిగో.. గిల్ క్యాచ్ ను రిప్లేలో చూసేప్పుడు థర్డ్ అంపైర్ ఇలా ఉన్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆధారాలు సరిగ్గా లేనప్పుడు, అనుమానంగా ఉన్నప్పుడు దానిని నాటౌట్ గానే పరిగణించాలని వీరూ పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై సెటైర్ వేస్తూ మీమ్ ను షేర్ చేశాడు.