WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా విజయానికి చేరువలో ఉందంటున్నాడు వెటరన్ పేసర్  మహ్మద్ షమీ. ఈ మ్యాచ్ ను వంద శాతం గెలుస్తామని  షమీ  తెలిపాడు. 

‘రేపు వంద శాతం మేమే మ్యాచ్ ను గెలుచుకుంటాం. ఎందుకంటే పోరాడుతూనే ఉన్నాం. ఇక్కడే కాదు. ప్రపంచ్యవాప్తంగా మేం మంచి ప్రదర్శనలు కనబరుస్తూనే ఉన్నాం. అది బ్రిస్బేన్ కావొచ్చు. లార్డ్స్ కావొచ్చు. ఓవల్ కావొచ్చు. ఈ మ్యాచ్ లో గెలవడానికి మేం కలిసికట్టుగా పోరాడతాం’ అంటున్నాడు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ. ఓవల్ లో ఆఖరి రోజు భారత విజయానికి 280 పరుగులు అవసరం ఉండగా ఒక్క రోజు అది చేయడం పెద్ద కష్టమేమీ కాదని షమీ తెలిపాడు. 

నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత షమీ విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు. 444 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్), అజింక్యా రహానే (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

ఆట ముగిశాక షమీ మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం మేం బాగా బ్యాటింగ్ చేస్తే ఒక్క రోజులో 280 పరుగులు చేయడం పెద్ద విషయమేమీ కాదు. అదేం పెద్ద టార్గెట్ కూడా కాదు. ఒక నార్మల్ టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడితే సరిపోతుంది. అనవసరమైన ఒత్తిడికి గురి కాకుండా బంతికి ఒక పరుగు అన్న రీతిలో ఆడితే ఈజీగా గెలవొచ్చు. ఇదేదో భారీ టార్గెట్ అన్న విధంగా చూడొద్దు. చిన్న గోల్స్, చిన్న టార్గెట్లు ఉంటేనే ఎక్కువ సక్సెస్ అవుతాము. నేనైతే టీమిండియా రేపు నార్మల్ టెస్ట్ మ్యాచ్ ఆడినా సరిపోతుంది. నేను కూడా బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నా. నాతో పాటు అందరూ జట్టు గెలవడానికి బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు’అని చెప్పాడు.

Scroll to load tweet…

మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 296 పరుగులే చేయగలిగింది. దీంతో ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 173 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్.. 8 వికెట్లు కోల్పోయి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్.. నాలుగో రోజు ఆట ముగిసేటప్పటికీ 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 నాటౌట్) అజింక్యా రహానే (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు భారత్ 280 పరుగులు సాధిస్తుందా..? లేదా ఆసీస్ ఏడు వికెట్లు తీస్తుందా..? అన్నదిక ఆసక్తికరంగా మారింది.