Asianet News TeluguAsianet News Telugu

అక్కెరకు రాని చుట్టము విడువంగ వలయు గదరా సుమతీ..! పుజారాదీ ముగిసిన ఇన్నింగ్సేనా..?

WTC Final 2023 : ఐపీఎల్‌లో ఆడడు. టీమిండియా  రెగ్యురల్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ మాదిరి అన్ని ఫార్మాట్ల ప్లేయర్ కాదు.   వర్క్ లోడ్ లేదు.  బయట కూడా పెద్దగా కనిపించడు. అయినా కీలక మ్యాచ్‌లలో వైఫల్యమే...

WTC Final 2023: Cheteshwar Pujara Continues His Poor Form, Fans Demand Retirement MSV
Author
First Published Jun 11, 2023, 10:26 AM IST

‘అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ...!’ అన్నాడు సుమతీ శతకంలో బద్దెన. ఈ పద్యానికి అర్థం ఏంటంటే..  అవసరానికి పనికిరాని చుట్టం,  చేతులెత్తి మొక్కినా  కోరిక నెరవేర్చని భగవంతుడు, యుద్ధ సమయంలో  ముందుకు పరుగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టాలి అని.. ఈ పద్యం టీమిండియా టాపార్డర్  బ్యాటర్లలో చాలామందికి అన్వయించుకోవచ్చు. మరీ ముఖ్యంగా  ‘నయా వాల్’  ఛటేశ్వర్ పుజారాకైతే బాగా సూటవుతుంది. అతడి ఆట అలా ఉంది మరి..! 

ఎందుకంటే... ఐపీఎల్‌లో ఆడడు. టీమిండియా  రెగ్యురల్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ మాదిరి అన్ని ఫార్మాట్ల ప్లేయర్ కాదు.   వర్క్ లోడ్ లేదు.  బయట కూడా పెద్దగా కనిపించడు.  పార్టీలు,  ఫ్రెండ్స్ కూడా తక్కువే. 

టీమిండియా టెస్టులు ఆడితే  ఉంటాడు లేకుంటే అతడి పేరే గుర్తురాదు.  టెస్టులు లేకుంటే  ప్రాక్టీస్ లేదా  ఇంగ్లాండ్ లో జరిగే కౌంటీలలో ఆడటం.. ఏడాదంతా దాదాపు ఇదే షెడ్యూల్. ఇంత చేసినా  పుజారా  భారత జట్టుకు  టెస్టులలో ఏం ఒరగబెడుతున్నాడు..?

కౌంటీలలో సూపర్ సక్సెస్.. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భాగంగా భారత జట్టు  పుజారాపై భారీ ఆశలు పెట్టుకుంది.  టీమిండియాలో పుజారా మినహా తక్కిన  ఆటగాళ్లంతా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తర్వాత  వన్డేలు, ఆ పై రెండు నెలలు  ఐపీఎల్ ఆడి నేరుగా ఇంగ్లాండ్‌కు వచ్చినోళ్లే. వాళ్లు ఫెయిల్ అన్నారన్నా ఓ అర్థముంది (ఇది వాళ్లకు సమర్థింపు కాకున్నా  ఐపీఎల్‌లో వాళ్లు అలిసిపోయారన్నది జగమెరిగిన సత్యం) కానీ   పుజారా మాత్రం   బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత  నెలన్నర ఖాళీగానే ఉన్నాడు. మే‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు  ఇంగ్లాండ్ వచ్చాడు.  

కౌంటీలలో ససెక్స్ తరఫున  ఏడు మ్యాచ్‌లు ఆడిన పుజారా  సూపర్ ఫామ్ లో ఉన్నాడు.   ఈ సీజన్ లో  పుజారా కౌంటీలలో చేసిన  పరుగుల జాబితాను ఓసారి చూస్తే.. 115, 32, 18, 13, 151, 136, 77గా ఉన్నాయి.  ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి.  ఆడుతోంది ఇంగ్లాండ్ లోనే కావున  పుజారా భారత్ జట్టుకు  కీలక ఆటగాడు అవుతాడని అభిమానులు కూడా భావించారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ లో రెండు ఇన్నింగ్స్‌లలో పుజారా స్కోర్లు.. 14, 27 (మొత్త 41) మాత్రమే. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ ‌లో ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని వదిలేసి  వికెట్ సమర్పించుకున్న తీరుపై  తీవ్ర   విమర్శలు వెళ్లువెత్తుతూనే ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ లోనూ అదే తీరు. గతేడాది కూడా పుజారా కౌంటీలు అదరగొట్టడంతో భారత్ - ఇంగ్లాండ్ రీషెడ్యూల్ టెస్టులో అతడి మీద భారీ ఆశలు పెట్టుకున్న టీమిండియాకు నిరాశ తప్పలేదు.  

గడిచిన  20 టెస్టు ఇన్నింగ్స్ లలో  పుజారా   సెంచరీ చేసింది ఒక్కసారే. అది కూడా బంగ్లాదేశ్‌పై.  ఈ సెంచరీ కూడా రెండేండ్ల తర్వాత చేసిందే కావడం గమనార్హం. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టులలో పుజారా చేసిన స్కోర్లు ఇవి : 42, 1, 59, 0, 31, 7..   

ఇన్నింగ్స్ ముగిసినట్టేనా..? 

టీమిండియాలో మరో ద్రావిడ్ గా గుర్తింపు పొందిన  పుజారా  2019 వరకూ  బాగానే ఆడాడు.  కానీ ఆ తర్వాతే పుజారా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.  2020 లో 8 ఇన్నింగ్స్ లు ఆడిన పుజారా చేసింది 163 పరుగులు. 2021లో 26  ఇన్నింగ్స్ లో  702 రన్స్ చేశాడు. గతేడాది 10 ఇన్నింగ్స్ లలో 409 రన్స్ చేయగా  ఈ ఏడాది ఐదు టెస్టులలో పది ఇన్నింగ్స్ ఆడి  చేసింది 280 పరుగులు.  వరుస వైఫల్యాలతో టీమ్ కు భారంగా మారతున్న  పుజారా ఇక రిటైరై కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తేనే బెటర్ అని టీమిండియా ఫ్యాన్స్ వాపోతున్నారు.  ఎంత గొప్ప ఆటగాడైనా ఆడనప్పుడు  ఎన్ని రోజులని టీమ్‌లో కొనసాగిస్తారని ఇప్పటికే పుజారాపై విమర్శలున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే  పుజారాను జట్టు నుంచి తీసేసే ప్రమాదమూ లేకపోలేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios