India WTC Final 2023 Squad: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మేరకు బీసీసీఐ  15 మంది సభ్యులతో కూడిన జట్టును  ప్రకటించింది. 

ఈ ఏడాది జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. తాజాగా ప్రకటించిన జట్టులో ఇటీవలే ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలోని టీమ్ మెంబర్సే ఉండగా ఐపీఎల్‌-16లో మెరుపులు మెరిపిస్తున్న టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను సెలక్టర్లు పట్టించుకోలేదు. 

జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా ఇండియా - ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టీమ్‌లో రహానే తిరిగి చోటు దక్కించుకోవడం ఆశ్చర్యమేమీ కాకపోయినా అతడిని ఎలా వాడుకుంటారన్నది ఆసక్తికరం. 

Scroll to load tweet…

2021 తర్వాత పేలవ ప్రదర్శనలతో ఫామ్ కోల్పోయిన రహానే.. 2022లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఆ సిరీస్ లో కూడా రాణించకపోవడంతో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీలలో నిలకడగా ఆడటమే గాక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొడుతున్న రహానేను పక్కనబెట్టలేని పరిస్థితి కల్పించాడు. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ గాయాలు కూడా రహానేకు కలిసొచ్చాయి. 

కాగా బీసీసీఐ తాజాగా ప్రకటించిన జట్టులో ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లు (రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే) , ఇద్దరు వికెట్ కీపర్లు (కెఎల్ రాహుల్, కెఎస్ భరత్), ముగ్గురు స్పిన్ ఆల్ రౌండర్లు (అశ్విన్, జడేజా, అక్షర్), ఒక పేస్ ఆల్ రౌండర్ (శార్దూల్ ఠాకూర్), నలుగురు పేసర్లు (షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్) ఉన్నారు. 

Scroll to load tweet…

డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, కెఎల్ రాహుల్, కెఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్