Asianet News TeluguAsianet News Telugu

ఆలస్యంగా గెలుపు బాట పట్టిన ఆర్సీబీకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలాగంటే.. ?

WPL 2023:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్    లో తొలి అంకం  ముగిసేందుకు మరో నాలుగు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి.   ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. 

WPL 2023: Here Is How RCB Qualifies The Playoffs MSV
Author
First Published Mar 19, 2023, 3:10 PM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  భారీ అంచనాలతో అడుగుపెట్టిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)   అభిమానుల ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తొలుత ఆడిన  ఐదు మ్యాచ్ లలోనూ ఓడి తర్వాత  పుంజుకుంది.  ఈనెల 15న యూపీ వారియర్స్ ను ఓడించిన ఆ జట్టు.. శనివారం గుజరాత్  జెయింట్స్  ను చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే వరుసగా రెండు మ్యాచ్ లు గెలవడంతో  ఆర్సీబీకి  ఇంకా ఈ లీగ్ లో ప్లేఆఫ్స్ అవకాశాలు  మిగిలే ఉన్నాయి. 

ప్రస్తుతానికి డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టిక చూస్తే  ముంబై.. ఆరు మ్యాచ్ లలో ఐదు గెలిచి  10 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా  ఢిల్లీ.. ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచి  రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లూ   ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాయి.   

మూడో స్థానంలో యూపీ వారియర్స్  ఆరు మ్యాచ్ లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో ఉండగా ఆర్సీబీ.. ఏడు మ్యాచ్ లలో రెండు మాత్రమే గెలిచి నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ కూడా ఏడు మ్యాచ్ లలో రెండు గెలిచినా  నెట్ రన్ రేట్ కారణంగా  చివరి స్థానంలో నిలిచింది.  

ఆర్సీబీ ప్లేఆఫ్ చేరాలంటే.. 

ప్రస్తుతం ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే  తాము తర్వాత ముంబైతో ఆడబోయే మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి.   అంతేగాక   యూపీ వారియర్స్ టీమ్ తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోవాలి. యూపీ ఈ లీగ్ లో తదుపరి మ్యాచ్ లను ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ తో ఆడనుంది.  

 

నెట్ రన్ రేట్ కీలకం.. 

యూపీ రెండు మ్యాచ్ లలోనూ ఓడి  ఆర్సీబీ.. ముంబైని ఓడిస్తే అప్పుడు మంధాన అండ్ కో. కు    ఆరు పాయింట్లు  దక్కుతాయి. అయితే నెటట్ రన్ రేట్  ఇక్కడ కీలకంగా మారనుంది.  ప్రస్తుతం యూపీ నెట్ రన్ రేట్     -0.117 గా ఉండగా  ఆర్సీబీ -1.044 తో ఉంది.   ఆర్సీబీ.. ముంబైపై ఘన విజయం సాధించడమే గాక యూపీ.. తమ తర్వాత మ్యాచ్ లలో  40 పరుగుల తేడాతో ఓడితే అప్పుడు యూపీ నెట్ రన్ రేట్  కంటే ఆర్సీబీకి మెరుగైన రన్ రేట్ ఉంటుంది.  

ఇదంత జరిగే పనేనా..? 

ఇవన్నీ  గాలిలో దీపం పెట్టి  కడుతున్న లెక్కలే.  వాస్తవానికి   యూపీ తాము తర్వాత ఆడబోయే రెండు  మ్యాచ్ లలో భారీ తేడాతో ఓడటం  అంత తేలికేం కాదు. ఒక్క మ్యాచ్ గెలిచినా లేక రెండు మ్యాచ్ లలో  సాధారణ ఓటములు ఎదురైనా ప్లేఆఫ్స్ చేరడానికి  ఆర్సీబీ, గుజరాత్ కంటే యూపీకే ఎక్కువ అవకాశాలున్నాయి. వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడిన  ఆర్సీబీ.. ఆలస్యంగా  మేలుకున్నా గత రెండు మ్యాచ్ లలో గెలిచి ఫ్యాన్స్ కు ఊరట విజయాలను అందిస్తున్నది. చివరి మ్యాచ్ లో కూడా అలాంటి విజయమే సాధిస్తే  ఈ లీగ్ ను  విజయంతో ముగించొచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios