డబ్ల్యూపీఎల్ మొదలయ్యేది అప్పుడే.. తొలి మ్యాచ్ వాళ్లిద్దరి మధ్యే.. కన్ఫర్మ్ చేసిన ఐపీఎల్ చైర్మెన్
WPL 2023: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) షెడ్యూల్ ను ఐపీఎల్ అధ్యక్షుడు అరుణ్ ధుమాల్ ఖాయం చేశారు.

భారత క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. వచ్చే నెల 4 నుంచి మొదలుకాబోతుంది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధ్యక్షుడు అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు. ముంబైలో పీటీఐతో మాట్లాడుతూ ధుమాల్.. డబ్ల్యూపీఎల్ వేలంతో పాటు టోర్నీ షెడ్యూల్ తేదీలను వెల్లడించాడు. ఫిబ్రవరి 13న ముంబై వేదికగా ప్లేయర్స్ యాక్షన్ ఉంటుందని చెప్పిన ధుమాల్.. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ ప్రారంభం కాబోతుందని వివరించాడు.
ధుమాల్ మాట్లాడుతూ..‘ఈనెల 13న వేలం ఉండబోతుంది. ముంబై వేదికగా వేలాన్ని నిర్వహిస్తాం. ఈ లీగ్ తొలి సీజన్ మార్చి 4 నుంచి 26 మధ్య జరుగుతుంది. తొలి మ్యాచ్ ను ముంబై - అహ్మదాబాద్ (గుజరాత్ జెయింట్స్) మధ్య నిర్వహిస్తాం..’ అని పీటీఐతో అన్నాడు.
కాగా ఈ లీగ్ ఫుల్ షెడ్యూల్ ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనుంది. వేలం ముగిశాక షెడ్యూల్ ను ప్రకటించే అవకాశముంది.ఈ లీగ్ లో బీసీసీఐ గతనెలలోనే ఐదు ఫ్రాంచైజీలు, అవి గెలుచుకున్న వారి వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. పురుషుల ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్ లో కూడా నగరాల పేరిట ఫ్రాంచైజీలను తీసుకొచ్చారు. ఐదు జట్లను వేలం వేయడం ద్వారా బీసీసీఐకి రూ. 4,669 కోట్లు సమకూరింది.
ఫ్రాంచైజీల వివరాలు
1. అహ్మదాబాద్ (అదానీ- గుజరాత్ జెయింట్స్) - రూ. 1,289 కోట్లు
2. ముంబై (అంబానీ) - రూ. 912.99 కోట్లు
3. బెంగళూరు (ఆర్సీబీ) - రూ. 901 కోట్లు
4. లక్నో (క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్) - రూ. 757 కోట్లు
5. ఢిల్లీ (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ. 810 కోట్లు
వేలం ఎక్కడ..? ఎప్పుడు..?
- ఫిబ్రవరి 13. ముంబైలో
ఎంతమందిని కొనుగోలు చేయవచ్చు..?
- డబ్ల్యూపీఎల్ లో ఒక టీమ్ 15 నుంచి 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. వీరిలో ఏడుగురు ఓవర్సీస్ (విదేశీ) ప్లేయర్లను తీసుకునే ఛాన్స్ ఉంది.
పర్స్ వాల్యూ..
- డబ్ల్యూపీఎల్ లో ఒక్కో టీమ్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రూ. 12 కోట్ల వరకు ఖర్చు చేసే లిమిట్ ఉంది.
బేస్ ప్రైస్ వివరాలు
- అన్ క్యాప్డ్ ప్లేయర్స్‌కు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఛాన్స్ ఉంది.
- క్యాప్డ్ ప్లేయర్స్‌కు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ ఛాన్స్.
డబ్ల్యూపీఎల్ వేదికలు
- మార్చి 4 నుంచి 26 వరకు జరుగబోయే (షెడ్యూల్ ను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) ఈ లీగ్ లో మ్యాచ్ లను ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంతో పాటు బ్రబోర్న్ స్టేడియంలో నిర్వహించనున్నారు.