Asianet News TeluguAsianet News Telugu

వుమెన్స్ ఆసియా కప్ 2022: బోణీ అదిరింది... శ్రీలంక వుమెన్స్‌పై భారత వుమెన్స్ ఘన విజయం...

శ్రీలంక వుమెన్స్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న భారత మహిళా జట్టు... 109 పరుగులకి ఆలౌట్ అయిన శ్రీలంక జట్టు...

Womens Asia Cup T20: India Women Team beats Sri Lanka Women team in Womens Asia Cup
Author
First Published Oct 1, 2022, 4:27 PM IST

వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీని ఘనంగా ప్రారంభించింది భారత మహిళా క్రికెట్ టీమ్. శ్రీలంకతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది భారత మహిళా జట్టు. 151 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

ఛమరి ఆటపట్టు 5, మల్షా సెహనీ 9 పరుగులు చేసి అవుట్ కాగా 20 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన హర్షిత మాదవి రనౌట్ అయ్యింది. 32 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసిన హాసినీ పెరేరాని దీప్తి శర్మ అవుట్ చేయగా నీలాక్షి డి సిల్వ 3, కవిషా దిల్హారీ 1, అనుష్క సంజీవని 5, రణసింగే 11, సుగంధిక కుమారి 4, అచినీ కులసూరియ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. 

భారత బౌలర్లలో దయాలన్ హేమలత 2.2 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీశారు. రాధా యాదవ్‌కి ఓ వికెట్ దక్కింది. 


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగుల స్కోరు చేయగలిగింది. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన స్మృతి మంధాన, సుగంధిక కుమారి బౌలింగ్‌లో నీలాక్షి డి సిల్వకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన షెఫాలీ వర్మను రణసింగే పెవిలియన్ చేర్చింది....

4 ఓవర్లు ముగిసే సమయానికి 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌‌తో కలిసి మూడో వికెట్‌కి 92 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది జెమీమా రోడ్రిగ్స్. 30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యింది. 

రణసింగే బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన హర్మన్‌ప్రీత్ కౌర్, ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చి స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న జెమీమా రోడ్రిగ్స్, టీ20ల్లో 8వ అర్ధ శతకాన్ని అందుకుంది...

22 ఏళ్ల 26 రోజుల జెమీమా రోడ్రిగ్స్, అతి చిన్న వయసులో వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకుముందు బంగ్లాదేశ్ ప్లేయర్ ఫర్గానా హుక్ 25 ఏళ్ల 79 రోజుల వయసులో హాఫ్ సెంచరీ బాది, ఆసియా కప్ టీ20లో అర్ధ శతకం బాదిన పిన్న వయస్కురాలిగా ఉండింది...

53 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్‌ని లంక కెప్టెన్ చమరీ ఆటపట్టు క్లీన్ బౌల్డ్ చేసింది. ఆసియా కప్ ఆరంగ్రేటం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచింది రోడ్రిగ్స్. ఇంతకుముందు 2012లో హంకాంగ్‌పై అనుజా పాటిల్ 50 పరుగులు చేయడమే ఆరంగ్రేట మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన...

టీ20 వుమెన్స్ ఆసియా కప్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ది రెండో అత్యధిక వ్యక్తిగత ప్రదర్శన. ఇంతకుముందు 2018లో మలేషియాపై 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్. 2016లో పాకిస్తాన్‌పై 73, శ్రీలంకపై 62 పరుగులు చేసి మూడు, నాలుగు స్థానాల్లోనూ ఉంది మిథాలీ... 

వికెట్ కీపర్ రిచా ఘోష్ 6 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసి రణసింగే బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా పూజా వస్త్రాకర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యింది. హేమలత 10 బంతుల్లో 13 పరుగులు చేయగా దీప్తి శర్మ ఆఖరి బంతికి సింగిల్ తీసి భారత స్కోరును 150 మార్కు కు చేర్చింది. ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా టీమిండియా, తన తర్వాతి మ్యాచ్‌ని అక్టోబర్ 3న మలేషియాతో ఆడనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios