Women's T20 Challenge 2022: మహిళల టీ20 ఛాలెంజ్ లో భాగంగా పూణెలో జరిగిన వెలోసిటీ-ట్రయల్ బ్లేజర్స్ మ్యాచ్ లో వెలోసిటీ ఓడినా ఫైనల్ కు చేరింది. స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ మ్యాచ్ గెలిచినా ఇంటి బాట పట్టింది.
ఫైనల్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాణించిన ట్రయల్ బ్లేజర్స్.. బౌలింగ్ లో చేతులెత్తేసింది. వెలోసిటీ బ్యాటర్లలో కిరణ్ నవ్గిరె (34 బంతుల్లో 69.. 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడింది. ఓపెనర్ షఫాలీ వర్మ దూకుడుకు తోడు నవ్గిరె జోరు చూపించడంతో మ్యాచ్ నెగ్గకపోయినా వెలోసిటీ మాత్రం ఫైనల్ చేరింది. 190 పరుగుల లక్ష్య ఛేదనలో వెలోసిటీ 9 వికెట్ల నష్టానికి 174 పరుగులే చేసింది. ఫలితంగా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ట్రయల్ బ్లేజర్స్.. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఫైనల్ లో వెలోసిటీ.. మే 28 (శనివారం)న సూపర్ నోవాస్ తో తలపడుతుంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ 190 పరుగులు చేసింది. అయితే ఫైనల్ కు అర్హత సాధించాలంటే వెలోసిటీ.. 159 పరుగులు చేయాల్సి ఉండేది. అన్నే పరుగులకు ఆ జట్టును కట్టడి చేయగలిగితే ట్రయల్ బ్లేజర్స్ ఫైనల్స్ కు అర్హత సాధించేది. కానీ ఆ క్రమంలో ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లు విఫలమయ్యారు. నవ్గిరె ధాటికి వారంతా ఏం చేయాలో తోచక మిన్నకుండి పోయారు. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో వెలోసిటీ ఫైనల్ కు అర్హత సాధించింది.
భారీ లక్ష్య ఛేదనను వెలోసిటీ ధాటిగా ప్రారంభించింది. ఆ జట్టు ఓపెనర్లు యస్తికా భాటియా (19.. 3 ఫోర్లు), షఫాలీ వర్మ (15 బంతుల్లో 29.. 5 ఫోర్లు) దూకుడుగా ఆడారు. రేణుకా సింగ్ వేసిన తొలి ఓవర్లో యస్తికా రెండు ఫోర్లు బాదింది. అయితే సల్మాన్ ఖాటూన్ వేసిన నాలుగో ఓవర్లో బౌల్డ్ అయింది.
ఆమె స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కిరణ్ నవ్గిరె ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆది నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. గైక్వాడ్ వేసిన ఐదో ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన షఫాలీ వర్మ.. అదే ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయింది.
ఓపెనర్లు నిష్క్రమించినా నవ్గిరె అదరలేదు. ఆరో ఓవర్ వేసిన సల్మా ఖాటూన్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు, ఫోర్ తో చెలరేగింది. లారా వొల్వార్డ్ట్ (17) ఉన్నంతససేపు ధాటిగానే ఆడింది. ఇద్దరూ రెచ్చిపోయి ఆడటంతో వెలోసిటీ.. 9.3 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లో ఇంత తక్కువ టైం లో వంద రన్స్ చేసిన తొలి జట్టు వెలోసిటీ.
పూనమ్ యాదవ్ వేసిన 11వ ఓవర్లో లారా వెనుదిరిగింది. గైక్వాడ్ వేసిన 12వ ఓవర్లో దీప్తి శర్మ (2) కూడా పెవిలియన్ చేరింది. వరుసగా వికెట్లు పడుతున్నా నవ్గిరె మాత్రం తన దూకుడు ఆపలేదు. గైక్వాడ్ వేసిన 14వ ఓవర్లో సిక్స్ కొట్టిన ఆమె.. ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లో అతి తక్కువ బంతుల్లో (25) బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డులకెక్కింది.
లక్ష్యానికి దగ్గరవుతున్న కొద్దీ వెలోసిటీ వరుసగా వికెట్లు కోల్పోయింది. స్నేహ్ రాణా (11) కూడా రేణుకా సింగ్ బౌలింగ్ లో నిష్క్రమించింది. సిమ్రాన్ బహదూర్ (2) ను రోడ్రిగ్స్ అద్భుతమైన త్రో తో రనౌట్ చేసింది. ఆఖర్లో సిమ్రన్ బహదూర్ (12), కేట్ క్రాస్ (6) లు ఆడినా విజయం మాత్రం బ్లేజర్స్ నే వరించింది. బ్లేజర్స్ జట్టులో రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. రేణేకా సింగ్, హేలీ మాథ్యూస్, అరుందతి రెడ్డి, సోఫియా డంక్లీ తలో వికెట్ తీశారు.
