బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ఆ పేరెలా వచ్చింది..? ఇది ఎప్పట్నుంచి మొదలైంది..? ఆసక్తికర విషయాలివిగో...
Border-Gavaskar Trophy: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాలు ప్రతీ రెండేండ్లకోసారి చేసే సమరాన్ని యాషెస్ (బూడిద) అంటున్నాయి. భారత్ - దక్షిణాఫ్రికా మధ్య పోరును మహాత్మా గాంధీ - నెల్సన్ మండేలా అంటున్నాం.

ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది గొడవ.. రెండు దేశాల సైనికులు కొట్టుకుంటే అది యుద్ధం. మరి క్రికెట్ లో రెండు దేశాల క్రికెటర్లు హోరాహోరిగా పోరాడితే దానిని ఏమనాలి..? అదీ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్లుగా ఉన్న రెండు దేశాలు నువ్వానేనా అన్నట్టు పోరాడితే...? దేశ, కాల ప్రభావాల వల్ల ఈ క్రికెట్ సమరాలకు వివిధ పేర్లున్నాయి. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాలు ప్రతి రెండేండ్లకోసారి చేసే సమరాన్ని యాషెస్ (బూడిద) అంటున్నాయి. భారత్ - దక్షిణాఫ్రికా మధ్య పోరును మహాత్మా గాంధీ - నెల్సన్ మండేలా ట్రోఫీ అంటున్నాం. అలాగే ఆస్ట్రేలియా - ఇండియా మధ్య జరిగే సమరాన్ని బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ అని పిలుస్తున్నాం. బహుశా ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేర్ల మీద టెస్టు సిరీస్ లు జరుగుతుండటం అది భారత్ - ఆసీస్ లకే చెల్లింది.
భారత్‌లో భారత్ ను ఓడించాలనే కలలతో కొద్దిరోజుల క్రితమే కంగారూలు ఇండియాలో కాలుమోపారు. ఈనెల 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానున్నది. ఈ నేపథ్యంలో అసలు ఈ సిరీస్ ను బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ అని ఎందుకు పిలుస్తున్నామనేది ఇక్కడ చూద్దాం..
స్వాతంత్ర్య కాలం నుంచే ఆసీస్ తో ‘ఢీ’..
భారత్ - ఆస్ట్రేలియా లు టెస్టులో హోరాహోరి పోటీ పడటం దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిననాటి నుంచే ఉంది. రెండు శతాబ్దాల బ్రిటీష్ అరాచక పాలన నుంచి భారత్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న తర్వాత మన దేశం క్రికెట్ ఆడటానికి వెళ్లిన తొలి విదేశీ దేశం ఆస్ట్రేలియానే కావడం గమనార్హం. 1947-48 లోనే భారత్.. ఆసీస్ లో ఐదు టెస్టులు ఆడింది. ఆ సిరీస్ ను ఆసీస్ 4-0తో గెలుచుకుంది.
కంగా‘రూల్’..
ఆ తర్వాత 1956-57లో, 1959-60, 1964 - 65 లలో టెస్టు సిరీస్ లకు ఇండియానే ఆతిథ్యమిచ్చింది. 1967-68లో ఆసీస్, 1969-70లో ఇండియా 1977-78 లో ఆసీస్ లు టెస్టులకు ఆతిథ్యమిచ్చాయి. 1979-80 లో ఇండియా లో టెస్టులు జరిగాయి. అయితే 1947 నుంచి 1980 వరకు ఈ ఇరు జట్ల మధ్య 30 టెస్టు మ్యాచ్ లు జరగగా వాటిలో ఐదు మ్యాచ్ లలో మాత్రమే భారత్ గెలిచింది. ఆరు డ్రాగా మిగలగా ఆసీస్.. ఏకంగా 19 మ్యాచ్ లలో విజయాలు సాధించింది. 1964-65లో తప్ప (డ్రా) 1977-78 వరకు ప్రతి సిరీస్ లో ఆస్ట్రేలియాదే జైత్రయాత్ర.
మార్పు మొదలు..
ముప్పై ఏండ్ల పాటు సిరీస్ ఇండియాలో జరిగినా ఆస్ట్రేలియాలో అయినా విజయం వాళ్లదే. కానీ 1979-80లో భారత్ లో జరిగిన ఆరు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-0 తో గెలుచుకుంది. ఆసీస్ పై భారత్ కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ తర్వాత 1980-81, 1985-86లో (ఆస్ట్రేలియా ఆతిథ్యం), 1986-87 (ఇండియా)లో సిరీస్ లు జరిగాయి. కానీ అవి మూడు డ్రాగా ముగిశాయి. 1991- 92లో ఆసీస్ లో ఐదు మ్యాచ్ ల సిరీస్ జరిగింది. దానిని ఆసీస్.. 4-1తో నెగ్గింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ..
1992 తర్వాత ఇరు జట్ల మధ్య 1996-97లో టెస్టు మ్యాచ్ జరిగింది. భారత్ లోనే జరిగిన ఈ సిరీస్ కు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆసీస్ లెజెండరీ బ్యాటర్ అలెన్ బోర్డర్ పేరిట జరిపారు. అప్పట్నుంచీ ఈ సిరీస్ ను బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) అని పిలుస్తున్నారు.
ఈ ఇద్దరూ దిగ్గజాలు తమ దేశాలకు చేసిన క్రికెట్ సేవలకు గాను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈ సిరీస్ ను బీజీటీగా వ్యవహరిస్తున్నాయి. బోర్డర్.. 1978 నుంచి 1994 వరకు ఆసీస్ తరఫున ఆడాడు. 1987లో ఆసీస్ కు తొలి వన్డే వరల్డ్ కప్ అతడి నాయకత్వంలో వచ్చిందే. తన కెరీర్ లో 156 టెస్టులు ఆడిన బోర్డర్.. 11,174 పరుగులు చేశాడు.
ఇక గవాస్కర్ 1971 నుంచి 1987 వరకు భారత్ తరఫున ఆడాడు. 125 టెస్టులలో 10,122 పరుగులు చేశాడు. బ్యాటర్ గానే గాక సన్నీ.. 1985లో వరల్డ్ చాంపియన్షిప్ కూడా గెలిచాడు. భారత క్రికెట్ లో బ్యాటింగ్ కు ఆకర్షణ పెంచిందే గవాస్కర్ అని నానుడి. 1996-97 లో బీజీటీ నాటికి రెండు దేశాలు ఆడే సిరీస్ లో ఈ ఇద్దరే అగ్ర స్థానాల్లో ఉండేవారు.
బీజీటీ తర్వాత...
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కంటే ముందు ఇరు దేశాల మధ్య మొత్తంగా యాభై టెస్టులు జరిగాయి. ఇందులో 24 ఆసీస్ నెగ్గగా భారత్ 8 టెస్టులు మాత్రమే నెగ్గింది. ఒక టెస్టు టై అయింది. 17 టెస్టులు డ్రా గా ముగిశాయి. 1996 తర్వాత భారత్ జైత్రయాత్ర మొదలుపెట్టింది. 1996 నుంచి 2020-21 వరకూ ఈ ట్రోఫీలో 15 సిరీస్ లు జరిగాయి. ఇందులో 9 సార్లు టీమిండియానే విజేత. ఐదు సార్లు మాత్రమే ఆసీస్ నెగ్గింది. 2004-05 తర్వాత ఆసీస్.. భారత్ లో భారత్ ను ఓడించలేదు. మరి ఇప్పుడు రోహిత్ సేన ఆ రికార్డును కాపాడుకునేనా..?