ఆటలో అన్నిరోజలు మనవికావని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. ఐపీఎల్ 2020లో చెన్నై జట్టు ఘోర ఓటమి చవిచూసింది.  టైటిల్ పోరులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లోనూ చెన్నై ఓటమిపాలయ్యింది.  సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ సేన ఓడిపోయింది. దీంతో.. ప్లే ఆఫ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ధోనీ సేన ఆడిన పది మ్యాచ్ లలో కేవలం మూడు మ్యాచ్ లే గెలవడం గమనార్హం. కాగా.. నిన్నటి మ్యాచ్ లో ఓటమి అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడారు. తాము ఈసారి కొన్ని ప్రయోగాలు చేశామని అది అందరికీ నచ్చలేదని ధోనీ పేర్కొన్నారు.  కానీ మైదానంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. జట్టును పదేపదే మార్చడం వల్ల జట్టులో ఆటగాళ్లకు వాళ్ల స్థానంపై అభద్రతాభావం వస్తుందన్నారు. ఆ ఉద్దేశంతోనే జట్టులో ఎక్కువ మార్పులు చేయలేదన్నారు.

కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం రాలేదన్నది వాస్తమని ధోనీ అంగీకరించారు. అయితే.. వాళ్లలో తనకు పెద్దగా స్పార్క్ కనపడలేదని అన్నాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కోగలరన్న నమ్మకం తనకు రాలేదన్నాడు. వాళ్లపై నమ్మకం ఉంటే సీనియర్లను పక్కన పెట్టి వాళ్లనే జట్టులోకి తీసుకునేవాళ్లమని చెప్పాడు.

లీగ్ దశలో మిగిలిన మ్యాచుల్లో కుర్రాళ్లకే అవకాశం ఇస్తామని ధోనీ చెప్పారు. ఇకపై వాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదని.. స్వేచ్ఛగా ఆడుకోవచ్చని ధోనీ పేర్కొన్నాడు.