Asianet News TeluguAsianet News Telugu

అప్పటికే ఆమెకు రెండుసార్లు చెప్పాం.. అయినా విన్లేదు.. అందుకే : ‘రనౌట్’ వ్యవహారంపై స్పందించిన దీప్తి శర్మ

Deepti Sharma: రెండ్రోజలుగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ వ్యవహారంపై  దీప్తి తాజాగా స్పందించింది. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన దీప్తి.. విమానాశ్రయంలో  విలేకరులతో మాట్లాడింది. 

We had already warned her and we just followed the rules: Deepti Sharma On Run out Row
Author
First Published Sep 26, 2022, 4:38 PM IST

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మూడు వన్డేలలో ఇంగ్లాండ్ ను ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. అయితే మూడో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ ను దీప్తిశర్మ ‘రనౌట్’ చేయడం  వివాదాస్పదమైంది. నాన్ స్ట్రయికర్ ఎండ్ వద్ద ఉన్న  చార్లీ.. దీప్తి బౌలింగ్ చేస్తున్న క్రమంలో  క్రీజును దాటి ముందుకు వెళ్లడంతో ఆమె బంతి విసరకుండా అక్కడే ఉన్న వికెట్లను గిరాటేసింది. అయితే  దీనిపై ఇంగ్లాండ్ క్రికెటర్లు దీప్తిశర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీప్తి శర్మ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించలేదని సన్నాయి నొక్కులు నొక్కారు.  

గత రెండ్రోజలుగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ వ్యవహారంపై  దీప్తి తాజాగా స్పందించింది. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన దీప్తి.. విమానాశ్రయంలో  విలేకరులతో మాట్లాడింది. చార్లీ అప్పటికే రెండు సార్లు క్రీజు  దాటిపోతే తాము అంపైర్లకు ఫిర్యాదు చేశామని, తాము నిబంధనల ప్రకారమే  నడుచుకున్నామని చెప్పుకొచ్చింది. 

దీప్తి మాట్లాడుతూ... ‘ఇది మా ప్లాన్ లో ఓ భాగమే. ఎందుకంటే ఆమె (చార్లీ) అప్పటికే రెండు సార్లు క్రీజు దాటి ముందుకు వెళ్లింది. అదే విషయమై మేము అంపైర్ కు కూడా ఫిర్యాదు చేశాం.  కానీ ఆమె మళ్లీ అదే చేసింది. మేము నిబంధనల ప్రకారమే ఇలా చేశాం..’ అని చెప్పుకొచ్చింది. 

 

ఇక తన అంతర్జాతీయ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి  గురించి స్పందిస్తూ.. ‘ప్రతీ జట్టు మ్యాచ్ లు గెలవాలనే కోరుకుంటుంది. మేము కూడా ఈ మ్యాచ్ గెలిచి జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని అనుకున్నాం. మూడో వన్డేలో ఆ మేరకు జట్టుగా మేం ఏం చేయాలో అది చేశాం..’ అని తెలిపింది.  

ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  అప్పటికే టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో  చివరి వరుస బ్యాటర్లతో డీన్  (80 బంతుల్లో 47, 5 ఫోర్లు) ఇంగ్లాండ్ ను విజయానికి  చేరువ చేసింది. 

 

44వ ఓవర్ ను వేయాల్సిందిగా హర్మన్‌ప్రీత్ కౌర్.. దీప్తి శర్మకు బంతినిచ్చింది. ఆ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసిన డీన్.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు వెళ్లింది.  మూడో బంతిని వేయబోయిన దీప్తి.. డీన్  నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి చాలా ముందుకు జరగడాన్ని గ్రహించింది. దీంతో వెంటనే బంతిని విసరడం ఆపి   వికెట్లను గిరాటేసింది. అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశారు. అయితే రివ్యూలో దీప్తి.. బౌలింగ్ యాక్షన్ ను పూర్తి చేసిన తర్వాతే వికెట్లను గిరాటేసినట్టు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios