దుబాయ్: ఈ ఏడాది ఐసిసి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాన్ని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆక్రమించాడు. సోమవారం ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. 

కోహ్లీ 887 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, రోహిత్ 873 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాటల్లో కలిపి విరాట్ కోహ్లీ 2455 పరుగులు సాధించి నెంబర్ వన్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 10 సెంచరీలు చేసి 2442 పరుగులతో రెండో స్థానం సాధించాడు. 

వన్డేల్లో రోహిత్ శర్మ ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించినప్పటికీ ర్యాంకుల్లో మాత్రం కోహ్లీ తర్వాతనే నిలిచాడు. ఒక ఏడాదిలో ఓపెనర్ గా అత్యధిక పరులుగు చేసిన శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య (2387) రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. 

ఇదిలావుంటే, భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 17 స్థానాలు మెరుగుపరుచుకుని 71వ ర్యాంకులో నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 81వ స్థానం సాధించాడు.

గాయం కారణంగా కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నప్పటికీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) ముజీబ్ రెహ్మాన్ (అఫ్గనిస్తాన్) తర్వాత రెండు స్థానాల్లో ఉన్నారు.

ఆల్ రౌండర్లలో బెన్ స్టోక్స్ (ఇంగ్లాండు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 10లో భారత ఆటగాళ్లెవరూ లేరు. జట్టు ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండు 125 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, భారత్ 123 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.