నూరో టెస్టుకి వాడిన భారత జెర్సీని దివ్యాంగ అభిమానికి కానుకగా ఇచ్చిన విరాట్ కోహ్లీ... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో...
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్‌ను శత్రుదేశంగా భావించే పాకిస్తాన్‌లోనూ విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఫ్లకార్డులు కనిపించాయంటే, మనోడి క్రేజ్ ఏ రేంజ్‌కి విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు...
విరాట్ కోహ్లీ 100వ టెస్టు ఆరంభానికి ముందు, భారత్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ #ViratKohli100thTest ట్రెండింగ్‌లో నిలిచింది. పాక్ ప్లేయర్లను, దశాబ్దాల తర్వాత పాక్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా కంటే విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకున్నారు పాక్ అభిమానులు...
విరాట్ కోహ్లీకి ఇంతటి క్రేజ్ రావడానికి అన్ ఫీల్డ్ అతని అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో పాటు ఆఫ్ ఫీల్డ్ సింపుల్ అండ్ హంబుల్ బిహేవియర్ కారణం. తాజాగా ఓ దివ్యాంగుడైన భారత క్రికెట్ అభిమానికి, తన 100వ టెస్టు జెర్సీని కానుకగా ఇచ్చి, మనసు మనసు చాటుకున్నాడు విరాట్ కోహ్లీ...
మొహాలీ టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు మ్యాచ్ కోసం బెంగళూరు బయలుదేరింది భారత క్రికెట్ జట్టు. ఈ సమయంలో కొందరు క్రికెట్ ఫ్యాన్స్, భారత జట్టు టీమ్ బస్సు దగ్గరికి వచ్చి, తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ నిల్చున్నారు...
ఇలా వచ్చిన వారిలో ఓ దివ్యాంగ అభిమాని కూడా ఉండడాన్ని గమనించిన విరాట్ కోహ్లీ, తన టీమిండియా జెర్సీని అతనికి దగ్గరికి తీసుకొచ్చి, ఇచ్చి సైలెంట్‌గా బస్సు దగ్గరికి వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లీ తనవైపు చూస్తే చాలనుకున్న సదరు అభిమాని, తన ఫెవరెట్ క్రికెటర్ దగ్గరికి వచ్చి మరీ 100వ టెస్టు ఆడిన జెర్సీని కానుకగా ఇవ్వడంతో సంతోషంతో మురిసిపోయాడు...
మొహాలీ టెస్టు ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీని చూసేందుకు కొంత మంది యువ అభిమానులు, స్టేడియం వద్దకు చేరుకున్నారు. విరాట్ వస్తున్న సమయంలో అరుపులు, కేకలు... భారత మాజీ కెప్టెన్‌కి ఘన స్వాగతం పలికారు. వారిని గమనించిన విరాట్ కోహ్లీ, గ్రౌండ్ మెన్‌తో వారి షర్టులను తెప్పించుకుని, ఆటోగ్రాఫ్‌లు చేసి పంపాడు...
తన వందో టెస్టులో అదిరిపోయే పర్పామెన్స్ ఇవ్వలేకపోయినప్పటికీ రెండు మైలురాళ్లను అందుకున్నాడు విరాట్ కోహ్లీ... 65 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టు కెరీర్‌లో 900+ ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరుపున టెస్టుల్లో అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్‌గా ఆరో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ...
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 2058 టెస్టు ఫోర్లు కొట్టగా, రాహుల్ ద్రావిడ్ 1651, వీరేంద్ర సెహ్వాగ్ 1219, వీవీఎస్ లక్ష్మణ్ 1135, సునీల్ గవాస్కర్ 1016 ఫోర్లు బాదారు. గంగూలీ 900 ఫోర్లతో ఉన్నాడు.. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ, టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు...
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే 8+ వేలు పైగా టెస్టు పరుగులు సాధించారు... సచిన్ 154 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలురాయి అందుకుంటే, ద్రావిడ్ 158, వీరేంద్ర సెహ్వాగ్ 160, సునీల్ గవాస్కర్ 166 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నారు. విరాట్ కోహ్లీ తన 169 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు... తన 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇంతకుముందు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఫీట్ సాధించాడు...
