Asianet News TeluguAsianet News Telugu

దేశమేదైనా ప్రత్యర్థి ఎవరైనా సూర్యా భాయ్ తగ్గేదేలే.. కెరీర్ లో రెండో సెంచరీ.. కివీస్ ముందు భారీ లక్ష్యం

IND vs NZ: ఆడేది ఇండియాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా  న్యూజిలాండ్ లో అయినా తన ఆటతీరులో మాత్రం మార్పు లేదంటున్నాడు సూర్యకుమార్ యాదవ్.  ప్రపంచంలో ఎక్కడైనా తనది ఇదే ఆటని  మరోసారి ప్రూవ్ చేశాడు. 

Unstoppable Suryakumar Yadav Continues His Form,  India Sets 192 Target For New Zealand
Author
First Published Nov 20, 2022, 2:13 PM IST

ఇండియా-న్యూజిలాండ్ మధ్య  బే ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.  టీమిండియా  మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్  (51 బంతుల్లో 111 నాటౌట్, 11 ఫోర్లు, 7 సిక్సర్లు) మరోసారి వీరబాదుడు బాదాడు. ఏడాదికాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్య.. తాజాగా ఈ మ్యాచ్ లో కూడా  అదే ఆటతో ఆకట్టుకున్నాడు. క్రీజులో కుదురుకునేదాకా   నెమ్మదిగా ఆడిన సూర్య.. చివర్లో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్యతో పాటు ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 36, 5 ఫోర్లు, 1 సిక్స్) మెరవడంతో  భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. ఆరు వికెట్ల నష్టానికి 191  పరుగుల భారీ స్కోరు చేసింది.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. రిషభ్ పంత్ (6), ఇషాన్ కిషన్ లతో కొత్త  ప్రయోగం చేసింది.  టీ20 ప్రపంచకప్ లో అవకాశాలు లేని పంత్ కు ఇది గొప్ప ఛాన్సే అయినా పంత్ మాత్రం దానిని సద్వినియోగం చేసుకోలేదు. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో  తొలి బంతికి   టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చాడు.   

కానీ ఇషాన్ మాత్రం  బెదురులేకుండా ఆడాడు.  ఫెర్గూసన్ వేసిన నాలుగో ఓవర్లో సిక్స్ కొట్టిన అతడు.. మిల్నే వేసిన  ఐదో ఓవర్లో ఫోర్ కొట్టాడు. రిషభ్ తో కలిసి తొలి వికెట్ కు 36 పరుగులు  జతచేశాడు. 

రిషభ్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చాడు సూర్య. కిషన్ తో కలిసి   33 పరుగులు జోడించాడు.  జేమ్స్ నీషమ్ వేసిన  ఏడో ఓవర్లో రెండు ఫోర్లు  బాదాడు. కానీ ఇష్ సోధి వేసిన పదో ఓవర్లో తొలి బంతికి   ఇషాన్ ఔటయ్యాడు.  పది ఓవర్లకు భారత స్కోరు 75-2. 

అప్పటికీ సూర్య ఇంకా బ్యాట్ ఝుళిపించలేదు.  ఫెర్గూసన్ వేసిన  13వ ఓవర్లో సూర్య 4,6 తో రెచ్చిపోయాడు. కానీ  నాులగో బంతికి  శ్రేయాస్ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు.  32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు.    టిమ్ సౌథీ వేసిన  17వ ఓవర్లో  6, 4, 4 బాదాడు. ఆడమ్ మిల్నే వేసిన  18వ ఓవర్లో..  6, 6 కొట్టాడు. ఇక ఫెర్గూసన్ వేసిన   19వ ఓవర్లో  మాత్రం  రెచ్చిపోయాడు.  వరుస బంతుల్లో 4, 4,  4 కొట్టి టీ20 కెరీర్ లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు తరఫున ఈ ఫార్మాట్లో రెండు సెంచరీలు చేసిన ఘనత అందుకున్నాడు. 32 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన  సూర్య.. తర్వాత 17 బంతుల్లో (మొత్తంగా  49 బాల్స్ సెంచరీ)నే మరో 50 పరుగులు రాబట్టడం గమనార్హం. అదే ఓవర్లో చివరి రెండు బంతులను  4, 6 గా మలచి భారత్ స్కోరును 185 దాటించాడు. 

 

కానీ చివరి ఓవర్లో భారత్ దారుణంగా తడబడింది. టిమ్ సౌథీ వేసిన ఆ ఓవర్లో   తొలి రెండు బంతుల్లో హార్ధిక్ నాలుగు పరుగులు తీశాడు. తర్వాత వరుస బంతుల్లో పాండ్యా (13),  దీపక్ హుడా (0), వాషింగ్టన్ సుందర్ (0) లు పెవిలియన్ చేరారు.  దీంతో   సౌథీకి హ్యాట్రిక్ దక్కింది. చివరికి భారత్..  20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios