ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘోరంగా విఫలమౌతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడగా.. వాటిలో నాలుగు ఓటమి పాలయ్యింది. సోమవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లోనూ విఫలమైంది. మంచి బ్యాట్స్ మెన్లు, బౌలర్లు ఉండి కూడా పంజాబ్ వరస ఓటమిపాలవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. కాగా.. పంజాబ్ ఓటమి కి కారణం ఇదేనంటూ.. తాజాగా.. టీమిండియా మాజీ క్రికెటర్  ప్రజ్ఞాన్‌ ఓజా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

భారీ స్కోర్ చేయాలని దూకుడుగా ప్రయత్నిస్తూ.. పంజాబ్ కింగ్స్ క్రికెటర్లు ఓటమి మూటగట్టుకుంటున్నారంటూ  ప్రజ్ఞాన్‌ ఓజా పేర్కొన్నాడు. కనీసం బోర్డుపై ఎంత స్కోరు ఉంచితే బాగుంటుందో అనే విషయంలో క్లారిటీ లేక ఒత్తిడిలో పడిపోతున్నారన్నాడు.


ప్రధానంగా క్రిస్‌గేల్‌-నికోసల్‌ పూరన్‌లు అనవసరపు ఒత్తిడితో ఘోరంగా విఫలమవుతున్నారన్నాడు. వారిపై భారీ అంచనాలు ఉండటంతో ఎక్కువ పరుగులు చేయాలనే ఉద్దేశంతో సహజసిద్దమైన ఆటను వదిలేశారన్నాడు. అసలు పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ప్లానింగ్‌ బాలేదని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నాడు.

‘ ఆ ఇద్దరూ కేవలం భారీ స్కోర్లు చేయాలనే వస్తున్నారు. ఒక మంచి ఆరంభం దొరికిన తర్వాత ఆ ఆలోచన చేయాలి. పరిస్థితుల్ని బట్టి గేమ్‌ ప్లాన్స్‌ మార్చడం లేదు. పెద్ద క్రికెటర్లమనే ఆలోచన పక్కన పెట్టండి.. అప్పుడే మీరు పరుగులు చేయగలరు. ముందు 160-170 స్కోరు బోర్డుపై ఉంచాలనే ఆలోచనతో బ్యాటింగ్‌కు రండి.. వారిద్దరూ 180-190 పరుగులు చేయాలనే లక్ష్యంతో వస్తున్నారు. అదే మీపై ఒత్తిడి పెంచుతుంది. అసలుకే ఎసరు తెస్తుంది. మీ ఆలోచన తప్పు’ అని ఓజా విమర్శించాడు.