Asianet News TeluguAsianet News Telugu

FIFA: ఇరాన్ ఫుట్‌బాలర్‌కు షాకిచ్చిన ప్రభుత్వం.. దేశాన్ని కించపరుస్తున్నారంటూ అరెస్ట్

FIFA World Cup 2022: తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏ స్థాయిలో ఉన్నా కటకటాలు లెక్కించాల్సిందేనని ఇరాన్ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది.  జాతీయ జట్టుకు ఆడే ఫుట్‌బాలర్   ను కూడా అరెస్టు  చేసింది. 

Top Iran Football Player arrested For  Criticising Own Government
Author
First Published Nov 25, 2022, 1:56 PM IST

గత కొన్నాళ్లుగా ఇరాన్ లో  మహిళలు హిజాబ్ కు వ్యతిరేకంగా  పోరాడుతున్న విషయం తెలిసిందే.  వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్న ఈ ఉద్యమానికి మద్దతుగా  ఖతర్ వేదికగా జరుగుతున్న  ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ లో ఇరాన్ జాతీయ జట్టు.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా  జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపారు. దీనిపై అక్కడి మీడియా  పశ్చిమదేశాలపై కారాలు మిరియాలు నూరింది.  అయితే తాజాగా మరో  ఘటనలో ఇదే హిజాబ్ ఉద్యమానికి మద్దతునిచ్చిన మరో ఫుట్‌‌బాల్ క్రీడాకారుడిని అక్కడి ప్రభుత్వం ఏకంగా  అరెస్టు చేసింది.  

ఇరాన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు  వొరియా  గఫౌరీని  పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హిజాబ్ కు మద్దతు తెలపడమే గాక  కేంద్ర విదేశాంగం మంత్రి జావేద్ జరీఫ్ ను విమర్శించడం,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడనే ఆరోపణతో   అక్కడి ప్రభుత్వం  గఫౌరీని అరెస్ట్ చేసింది.  

2018లో  ఇరాన్ తరఫున ఫిఫా వరల్డ్ కప్ ఆడిన  గఫౌరి.. ఈసారి మాత్రం జట్టులో లేడు. ఇరాన్ లో ఖుర్ద్ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, వారిని అకారణంగా చంపేస్తున్నారని  అతడు  గతంలో ఆరోపించాడు. స్వతహాగా ఖుర్ద్ అయిన గఫౌరి..   ఇరాన్ లో మహిళలు ఫుట్‌బాల్ మ్యాచ్ లు చూడటానికి వీళ్లేదంటూ  చేసిన ఆదేశాలపై నిరసన గళం వినిపించాడు.  

 

కొద్దిరోజుల క్రితం గఫౌరి.. ‘ఖుర్దిష్ ప్రజలను చంపడం ఆపండి. ఖుర్ద్ లు కూడా ఇరాన్ లో భాగమే. వారిని చంపుతున్నారంటే మీరు ఇరాన్ ను నాశనం చేస్తున్నట్టే. మీరు ప్రజలను చంపడం పట్ల ఉదాసీనులుగా ఉంటే మీరసలు ఇరానీలే కాదు కనీసం మనుషులు కూడా కాదు.. ఇరాన్ లో అన్ని తెగలకు చెందిన ప్రజలు ఇరానీయులే. మనుషులను చంపకండి..’ అని ట్వీట్ చేశాడు. 

పశ్చిమ ఇరాన్ లోని సనందజ్ సిటీకి చెందిన ఓ ఖుర్దిష్ యువతిని  దుండగులు హత్య చేసిన ఘటనలో బాధితురాలికి గఫౌరి అండగా నిలవడం కూడా ప్రభుత్వానికి కోపం తెప్పించింది. ఇదే విషయంలో అతడు  చాలా మందికి అండగా నిలబడటం  ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.  ఇదేగాక హిజాబ్ నిరసనలకు మద్దతు తెలపడం.. ప్రభుత్వానికి  వ్యతిరేకంగా మాట్లాడటంతో  గఫౌరికి  ఇరాన్  గవర్నమెంట్ షాకిచ్చింది. 

 

ఇక ప్రపంచకప్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో  ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిన ఇరాన్.. నేడు వేల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఇరాన్ ఈ టోర్నీలో ముందుకెళ్లడం కష్టమే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios