స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మరో మైలురాయికి చేరుకున్నాడు. భారత జట్టుతో కలిసి అతడు చేస్తున్న ప్రయాణం పదేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అతడు సోషల్ మీడియా వేదికన భావోద్వేగపూరితంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 

''టీమిండియాతో కలిసి పదేళ్ల ప్రయాణం. నా దేశంకోసం 10ఏళ్లుగా ఆడటం కంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం వల్ల జీవితకాలానికి సరిపడా మధుర జ్ఞాపకాలు లభించాయి. ఈ అవకాశం కల్పించిన దేశానికి నేను ఎల్లపుడూ రుణపడి వుంటాను'' అంటూ భావోద్వేగపూరితంగా ట్వీట్ చేశాడు ధావన్. 

 

శిఖర్ ధావన్ దేశవాళి క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి 2010 అక్టోబర్ 20న అంతర్జాతీయ జట్టలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేసిన ధావన్ అప్పటినుండి వెనుదిరిగి చూడలేదు. ఓపెనర్ గా అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ టీమిండియా విజయాల్లో తనదైన పాత్ర వహించాడు. గత పదేళ్లుగా భారత జట్టులో ఓపెనర్ గా తన స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకుంటూ వస్తున్నాడు ధావన్.

KXIPvsDC: పంజాబ్ ఈజీ విక్టరీ... గెలిచి ప్లేఆఫ్ రేసులో కింగ్స్ ఎలెవన్...

అయితే పదేళ్ల తర్వాత ఇదే అక్టోబర్ 20న ధావన్ మరో ఘనత సాధించాడు. ఐపిఎల్ సీజన్ 13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డిల్లీ ఓపెనర్ గా బరిలోకి దిగిన గబ్బర్ సెంచరీ బాదాడు. ఈ సెంచరీతో పలు రికార్డులను అతడు బద్ధలు కొట్టాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా వార్నర్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు ధావన్. ధావన్, వార్నర్ రెండేసి సెంచరీలు బాదగా.. వీరేంద్ర సెహ్వాగ్, కేవిన్ పీటర్సన్, ఏబీ డివిల్లియర్స్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, డి కాక్ ఒక్కో సెంచరీ చేశారు. అలాగే ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు ధావన్. ఇంతకుముందు గేల్, ఆమ్లా, వాట్సన్ ఈ ఫీట్ సాధించారు. విరాట్ కోహ్లీ ఒకే సీజన్‌లో (2016) 4 సెంచరీలు బాది టాప్‌లో ఉన్నాడు.

ఇక ఐపీఎల్‌లో 5000 పరుగులను పూర్తిచేసుకున్నాడు శిఖర్ ధావన్... ఈ ఫీట్ అందుకున్న ఐదో బ్యాట్స్‌మెన్ ధావన్. ఇంతకుముందు రైనా, కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ఈ ఫీట్ అందుకున్నారు. 168 మ్యాచుల్లో 5 వేల మైలురాయి అందుకున్న ధావన్, వార్నర్ (135), విరాట్ కోహ్లీ (157) తర్వాత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు ధావన్.