వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దవ్వడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. వర్షం అంతరాయం కలిగించడం చెత్తగా ఉంటుందని.. ఇలా జరగకూడదని అసహనం వ్యక్తం చేశాడు.

పడితే పూర్తిగా వర్షమైనా పడాలి లేదంటే పూర్తి ఆటైనా కొనసాగాలని... మాటిమాటికి వర్షం అంతరాయం కలిగించడం చిరాకు తెప్పిస్తుందన్నాడు. మరోవైపు క్రికెట్‌లో ఇటీవలి కాలంలో అనూహ్య మార్పులొచ్చాయని.. అందుకు ఇంగ్లాండ్ ప్రదర్శనే నిదర్శనమని పేర్కొన్నాడు.

టీ20ల ప్రభావంతో వన్డేల్లో సునాయాసంగా 400 స్కోరు సాధించగలగుతున్నారని విరాట్ అభిప్రాయపడ్డాడు. కరేబియన్ దీవుల్లో మైదానాలు ఆటగాళ్లను పరీక్షిస్తాయని.. మరికొన్ని పేస్, బౌన్సింగ్‌కు అనుకూలిస్తాయని.. పరిస్ధితులను అర్ధం చేసుకుని ఆడిన జట్టే విజయం సాధిస్తుందని చెప్పాడు.

కాగా తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను అంపైర్లు 34 ఓవర్లకు కుదించగా 13 ఓవర్లపాటు బాగానే సాగినప్పటికీ.. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.