TATA IPL 2022 - MI vs LSG: భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ప్రధాన బ్యాటర్లంతా మళ్లీ అదే వైఫల్యమే ప్రదర్శించారు. బౌలర్లు దారుణంగా విఫలమైన చోట బ్యాటర్లు కూడా అదే ఆటతీరుతో నిరాశపరిచారు. ఫలితంగా ఆ జట్టు 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అదే ఆట.. ఏమీ మారలేదు. టాస్ గెలిచారు. ముందు బౌలింగ్ చేశారు. భారీగా పరుగులిచ్చారు. బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని చూసి ఒత్తిడికి గురయ్యారు. ఫలితం కూడా అంతే.. గత ఐదు మ్యాచుల్లో జరిగిందే ఈ మ్యాచ్ లో కూడా జరిగింది. ఐపీఎల్ లో వరుసగా ఆరో ఓటమిని నమోదు చేస్తూ మరో చెత్త ప్రదర్శన ఇచ్చింది ముంబై ఇండియన్స్. బౌలర్లు విఫలమైన చోట బ్యాటర్లైనా రాణిస్తారేమో అని ఆశించిన ముంబై ఫ్యాన్స్ కు మరోసారి పెద్ద నిరాశను మిగుల్చుతూ ‘మేమేం మారలేదు.. ’ అని నిరూపించింది. లక్నో నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో.. 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు మత్రమే చేసి (18 పరుగుల తేడాతో ఓటమి) ఈ సీజన్ లో వరుసగా ఆరో పరాజయం మూటగట్టుకుంది. ఇక ఈ సీజన్ లో లక్నోకు ఇది నాలుగో విజయం. కాగా ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే ముంబై రాబోయే 8 మ్యాచుల్లో ఎనిమిదింటిని నెగ్గాలి. ప్రస్తుతం ముంబై ఫామ్ ను చూస్తే అది అద్భుతమే..
భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆశాజనకంగా ప్రారంభం కాలేదు. కొండంత లక్ష్యమున్నా రెండు ఓవర్లలో ఆ జట్టు చేసింది పది పరుగులే. అవేశ్ ఖాన్ వేసిన 3వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ (6).. నాలుగో బంతికి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
గత మ్యాచ్ లో మెరుపులు మెరిపించడంతో ముంబై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న డెవాల్డ్ బ్రెవిస్ (13 బంతుల్లో 31.. 6 ఫోర్లు, 1 సిక్సర్) లు మెరుపులు మెరిపించాడు. ఉన్నది కాసేపే అయినా లక్నో బౌలర్లను వణికించాడు. ఎదుర్కున్న రెండో బంతికే ఫోర్ కొట్టిన అతడు.. బిష్ణోయ్ వేసిన నాలుగో ఓవర్లో మరో బౌండరీ బాది తన ఉద్దేశాన్ని చాటాడు.
ఇక దుష్మంత చమీర వేసిన ఐదో ఓవర్లో నాలుగో బంతిని సిక్సర్ గా మలిచిన బేబీ ఏబీడీ.. తర్వాత రెండు బంతులను బౌండరీ దాటించాడు. అవేశ్ ఖాన్ వేసిన ఆరరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఈ సఫారీ కుర్రాడు.. అదే ఓవర్లో ఐదో బంతికి కవర్స్ లో హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడు.. 31 పరుగులు చేస్తే అందులో ఫోర్లు, సిక్సర్ ద్వారా వచ్చినవే 30 పరుగులు కావడం విశేషం. బ్రెవిస్ ఔటైన తర్వాతి ఓవర్లోనే స్టోయినిస్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 13) బౌల్డ్ అయ్యాడు.
ఈ క్రమంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (27 బంతుల్లో 37.. 3 ఫోర్లు), తిలక్ వర్మ (26 బంతుల్లో 26) లు వికెట్ల పతనాన్ని కాస్త అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 64 పరుగులు జోడించారు. వికెట్లను అడ్డుకున్నారే తప్ప భారీ మెరుపులేం మెరిపించలేదు. అయితే ఈ జోడీని హోల్డర్ విడదీశాడు. హోల్డర్ వేసిన 15వ ఓవర్లో తిలక్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే రవి బిష్ణోయ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి సూర్య కూడా గౌతమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అప్పటికే సమీకరణం 4 ఓవర్లకు 68 పరుగులు. ఇక తిలక్ నిష్క్రమించిన వచ్చిన పొలార్డ్ ( 14 బంతుల్లో 25) దుష్మంత చమీర వేసిన 17వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. పొలార్డ్ క్రీజులో ఉండటంతో ముంబై కాస్త ఆశలు పెట్టుకుంది. అయితే ఆఖర్లో లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడమే గాక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిది. దీంతో ముంబైకి ఆరో ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్లో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది.
లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్ తో పాటు అలెన్ లు అవేశ్ బౌలింగ్ లోనే ఔటయ్యారు. జేసన్ హోల్డర్ తో పాటు రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్ లు కూడా తలో వికెట్ పడగొట్టారు. తాజా విజయంతో లక్నో ఐపీఎల్ పాాయింట్ల పట్టికలో పట్టికలో గుజరాత్ తర్వాత రెండో స్థానానికి చేరింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి కెఎల్ రాహుల్ (60 బంతుల్లో 103 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. క్వింటన్ డికాక్ (24), మనీష్ పాండే (38) లు రాణించారు.
సంక్షిప్త స్కోర్లు : లక్నో సూపర్ జెయింట్స్ : 199/4
ముంబై ఇండియన్స్ : 181/9
