TATA IPL 2022: వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఒక విజయంతో తిరిగి గాడిలో పడ్డట్టు కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ నేడు ఐపీఎల్-15 టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్ తో ఢీకొననుంది.
డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగి వరుసగా నాలుగు పరాజయాలతో ప్లేఆఫ్ రేసులో వెనుకబడ్డ రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. నేడు గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడనుంది. ముంబై ఇండియన్స్ అంత కాకపోయినా ప్లే ఆఫ్ ఆశలు బతికించుకోవాలంటే చెన్నై కి కూడా ప్రతి మ్యాచ్ కీలకమే. కాగా.. గుజరాత్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ లో చెన్నై.. టాస్ ఓడి బ్యాటింగ్ కు రానుంది. ఇక ఈ మ్యాచ్ లో గాయం కారణంగా గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యా ఆడటం లేదు. ఈ మ్యాచుకు రషీద్ ఖాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక హార్ధిక్ స్థానంలో వృద్ధిమాన్ సాహా ఆడుతున్నాడు. మాథ్యూ వేడ్ స్థానంలో అల్జారీ జోసెఫ్ జట్టులోకి వచ్చాడు. చెన్నై జట్టులో మార్పులేమీ లేవు.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే 9వ స్థానంలో ఉంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎట్టకేలకు ఓ విజయం అందుకున్న ఆ జట్టు విజయాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇక వరుస మూడు విజయాల తర్వాత సన్ రైజర్స్ చేతిలో ఓడిన గుజరాత్.. తిరిగి మూడు రోజుల క్రితం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది.
రవీంద్ర జడేజా సారథ్యంలోని సీఎస్కే.. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడినా బెంగళూరుతో మ్యాచ్ లో ఓపెనర్లు రాబిన్ ఊతప్ప కు తోడు యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే వీరవిహారంతో కోలుకుంది. అదే ఫామ్ ను కొనసాగించాలని చెన్నై భావిస్తున్నది. బౌలర్లు భారీగా పరుగులిచ్చుకుంటున్నప్పటికీ బ్యాటర్లు కాస్త ఫర్వాలేదనిపిస్తుండటం ఆ జట్టుకు శుభపరిణామమే.
ఇక బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా సమర్థంగా రాణిస్తున్న గుజరాత్.. అదే ఫామ్ ను కొనసాగించాలని అనుకుంటున్నది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ లో దుమ్ము దులుపుతున్నాడు. బౌలింగ్ లో కూడా రాణిస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే అయినా అతడు ఈ మ్యాచ్ లో ఆడకపోవడం గుజరాత్ కు షాకే. ఇక ఓపెనర్ శుభమన్ గిల్ చెలరేగితే చెన్నైకి కష్టాలు తప్పవు. మిడిలార్డర్ లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా మెరుపులు మెరిపిస్తున్నారు. కాగా.. ఐపీఎల్ లో చెన్నైతో పోటీ పడుతుండటం ఇదే ప్రథమం.
తుది జట్లు :
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహీశ్ తీక్షణ, ముఖేశ్ చౌదరి
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహ్మద్ షమీ
