ఇండియా- నెదర్లాండ్స్ మ్యాచ్‌లో క్రేజీ లవ్ ప్రపోజల్... భారత క్రికెటర్లకు ఫుడ్ పెడతానంటూ మరొకడు...
సిడ్నీ గ్రౌండ్ సాక్షిగా గర్ల్ ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ చేసిన భారతీయుడు... మనోడి ధైర్యానికి ఎస్ చెప్పిన అమ్మాయి... సోషల్ మీడియాలో వీడియో వైరల్...
క్రికెట్ ఓ ఆట మాత్రమే కాదు, చాలామందికి అదో ఎమోషన్. భారతీయులకు ఫుట్‌బాల్ పెద్దగా ఎక్కలేదు కానీ క్రికెట్ వారి సంస్కృతిలో ఓ భాగంగా మారిపోయింది. భారత జట్టు బాగా ఆడితే ఆనందంతో షర్టు విప్పి డ్యాన్సులు చేసే క్రికెట్ ఫ్యాన్స్, బాగా ఆడని రోజు తమకేదో నష్టం జరిగిపోయినట్టు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతారు... ఇప్పుడు క్రికెట్ స్టేడియాలు, లవ్ ప్రపోజల్స్‌కి వేదికలుగా మారిపోతున్నాయి...
2020 ఆస్ట్రేలియా టూర్‌లో ఓ భారత అభిమాని, తన గర్ల్ ఫ్రెండ్ ఆస్ట్రేలియా అమ్మాయికి ప్రపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ప్రేమ జంట గురించి దాదాపు ఏడాది పాటు చర్చ జరిగింది. ఐపీఎల్‌లోనూ ఇలాంటి సీన్స్ చాలానే జరిగాయి. 2021 ఐపీఎల్ సమయంలో సీఎస్‌కే క్రికెటర్, తన గర్ల్‌ఫ్రెండ్ జయ భరద్వాజ్‌కి లవ్ ప్రపోజ్ చేయగా.. 2022 ఐపీఎల్ సమయంలో ఓ అమ్మాయి, తన బాయ్‌ఫ్రెండ్ అయిన ఆర్‌సీబీ అభిమానికి ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..
తాజాగా ఇండియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌కి సిడ్నీ మైదానంలోనూ ఓ లవ్ ప్రపోజల్ అందరి దృష్టిని ఆకర్షించింది. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఫోకస్ అంతా భారత క్రికెటర్లపైనే ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకున్నాడో ఏమో కానీ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో ఓ భారత కుర్రాడు, తన గర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ పిల్ల కూడా అంత మంది మధ్యలో ప్రపోజ్ చేసిన మనోడి డేరింగ్‌కి నో చెప్పలేక... ‘ఎస్’ అనేసింది...
ఇదే సమయంలో భారత క్రికెటర్లకు హోమ్ మేడ్ ఇండియన్ ఫుడ్ అందిస్తానంటూ ఓ టీమిండియా అభిమాని, ప్లకార్డు పట్టుకుని ఉండడం కూడా విశేషంగా ఆకట్టుకుంది. సిడ్నీలో భారత క్రికెట్ టీమ్, సరైన ఫుడ్ దొరక్క ఇబ్బంది పడుతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే...
ఇదే మ్యాచ్ సమయంలో ఓ అభిమాని, స్టేడియంలో కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం వంటి సీన్స్, వన్ సైడ్‌గా సాగిన మ్యాచ్‌లో ప్రేక్షకులకు కాసింత వినోదాన్ని అందించాయి. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది...
కెఎల్ రాహుల్ 9 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్ల విజృంభణతో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసినా 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా మహ్మద్ షమీకి ఓ వికెట్ దక్కింది.