డేవిడ్ వార్నర్.... ప్రపంచ క్రికెట్లో ఈ పేరుకు పెద్ద పరిచయం అవసరం లేదు. మన తెలుగువారికైతే ఐపీఎల్ పుణ్యమాని అతనొక హీరో. ఐపీఎల్ లో సన్ రీసెర్స్ హైదరాబాద్ తరుఫున ఒంటి చేత్తో ఎన్ని మ్యాచులు గెలిపించాడో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఇలాంటి వార్నర్ బ్యాటింగ్ కి దిగితే అది నెక్స్ట్ లెవెల్. ప్రపంచ మేటి బౌలర్లంతా వార్నర్ కి బంతులు వేయడానికి వణికిపోతుంటారు. వార్నర్ పించ్ హిట్టింగ్ కి దిగితే పరుగుల సునామి ఖాయం. ఆ అద్భుతమైన క్రికెట్ విన్యాసాలను చూడడానికి అభిమానులకు రెండు కళ్లు చాలవు. 

ఇకపోతే ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ని చూస్తుంటే మాత్రం వార్నర్ ని పూర్తిగా అర్థం చేసుకొని, అతగాడిని అత్యంత సునాయాసంగా అవుట్ చేయగల ఫార్ములాని కనిపెట్టడం అనే అనుమానం కలుగక మానదు. 

2019 యాషెస్‌ సిరీస్‌లో వార్నర్‌ ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు బ్రాడ్‌ బౌలింగ్‌లోనే  ఔటయ్యాడు. ఆ యాషెస్‌ సిరీస్‌లో వార్నర్‌ చేసిన పరుగులు కేవలం 95 మాత్రమే!  గతేడాది యాషెస్‌ సిరీస్‌లో వార్నర్‌ కు ఎలా బంతులను సంధించి సక్సెస్‌ అయ్యాడో బ్రాడ్‌ వివరించాడు.

వార్నర్‌ చాలా ప్రమాదకర ఆటగాడని,  తాను దాదాపు 8-9 ఏళ్ల నుంచి వార్నర్‌ కు బౌలింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇంతకాలం పాటు సుదీర్ఘంగా బౌలింగ్ వేయడం, ఇరువురి మధ్య పోటీ ఉండటంతో వార్నర్ బలహీనతలను తాను చాలా త్వరగా కనిపెట్టగలిగినట్టు చెప్పుకొచ్చాడు. 

సాధారణంగా తాను పొడుగ్గా ఉండడం వల్ల వేగం ఎక్కువగా ఉండడం, స్వింగ్ కు అవకాశం ఉండడం వల్ల వార్నర్ క్రీజ్‌లో చాలా వెనక్కి డీప్ గా ఉంటాడని, అలా ఉండటం వల్ల స్వ్కేర్‌ డ్రైవ్‌ లను చాలా ఈజీ గా నా బౌలింగ్ కొట్టగలిగేవాడు అని బ్రాడ్ తెలిపాడు. 

తాను బంతిని స్వింగ్‌ చేసిన చాలాసార్లు వార్నర్‌ బౌండరీలు కొట్టాడని, కాబట్టి వ్యూహం మార్చాల్సి వచ్చిందని  బ్రాడ్ తెలిపాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వార్నర్ కి స్వింగ్‌ బౌలింగ్‌ వేయకూడదని డిసైడ్ అయ్యానని, కేవలం వికెట్‌ టు వికెట్‌ బంతులు మాత్రమే వేయాలనే వ్యూహమే వర్కౌట్‌ అయ్యిందని బ్రాడ్ తెలిపాడు. 

స్టంప్స్ ను గురి చూసి మాత్రమే  వార్నర్‌ కు బంతులు వేశానని, దాంతో బంతిని కట్‌ చేయబోయి వార్నర్‌ వికెట్‌ను సమర్పించుకునే వాడని బ్రాడ్ అసలు సీక్రెట్ చెప్పాడు.