ఇప్పటికీ నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా... స్నేహితుడికి రికీ పాంటింగ్ కన్నీటి వీడ్కోలు... స్నేహితుడిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న రికీ పాంటింగ్...
కొన్ని బంధాల గురించి మాటల్లో వివరించడం కష్టం. వాటిని మనసుతో అనుభవించాల్సిందే. అలా అనుబంధమే షేన్ వార్న్‌తో రికీ పాంటింగ్‌ది. 52 ఏళ్ల వయసులో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితుడు షేన్ వార్న్‌కి కన్నీటితో వీడ్కోలు పలికాడు రికీ పాంటింగ్...
‘ఈ వార్త ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నువ్వు లేవనే నిజాన్ని ఈ ప్రపంచం నమ్మినా, నాకు మాత్రం నమ్మకం కలగడం లేదు. ఉదయం లేస్తూనే చాలామంది నాకు మెసేజ్‌లు చేశారు. మా అమ్మాయిని నెట్‌బాల్ ప్రాక్టీస్‌కి తీసుకెళ్లి వచ్చేసరికి రాత్రి బాగా ఆలస్యమైంది...
నిద్ర లేచిన తర్వాత చూస్తే ఫోన్ నిండా మెసేజ్‌లు. నమ్మలేక పోయా. నిద్రలో కల కంటున్నానేమోనని అనుకున్నా. ఇది నిజం కాదేమో. ఇప్పటికీ నేను ఆ కలలోనే ఉన్నానేమో అనిపిస్తోంది...
కొన్ని గంటల వరకూ ఇది నిజం అని జీర్ణించుకోలేకపోయా. నా జీవితంలో నువ్వు ఎలా భాగమయ్యావో, ఇన్నేళ్ల పాటు నీతో కలిసి గడిపిన రోజులన్నీ గుర్తుకు వస్తూనే ఉన్నాయి...

క్రికెటర్ కెరీర్ ముగించిన తర్వాత కోచింగ్ క్లీనిక్‌లు మొదలెట్టాలని అనుకున్నాం. ఆస్ట్రేలియాలో పుట్టే ప్రతీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్‌లా మారాలని కలలు కన్నారు. దానికి కారణం నువ్వే. వార్న్... నువ్వు ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లలో ఒకటిగా నిలిచిపోతావ్. నీ కంటే మంచి బౌలర్‌తో, పోటీపడే బౌలర్‌తో నేనెప్పుడూ ఆడలేదు. నువ్వు స్పిన్ బౌలింగ్‌లో ఓ విప్లవాన్నే తీసుకొచ్చావు...’ అంటూ షేన్ వార్న్‌ని గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...
షేన్ వార్న్, రికీ పాంటింగ్ కలిసి 12 ఏళ్ల పాటు కలిసి ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఆసీస్ స్పిన్ బౌలర్ షేన్ వార్న్. తన కెరీర్ లో 145 టెస్టులాడిన షేన్ వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు, 194 వన్డే మ్యాచులు ఆడి 293 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్... మార్చి 4న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. థాయ్ లాండ్‌లో తన విల్లాలో షేన్ వార్న్, అపస్మారక స్థితిలో పడి ఉన్న షేన్ వార్న్‌ను గుర్తించిన ఆయన స్నేహితులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే షేన్ వార్న్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు...
అయితే షేన్ వార్న్ మృతిపై థాయ్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.షేన్ వార్న్ గదిలో రక్తపు మరకలు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. షేన్ వార్న్ ఉంటున్న గదిలో టవల్స్‌కి, ఫ్లోర్ అంతా రక్తపు మరకలు ఉండడాన్ని బట్టి చేస్తుంటే... ఆసీస్ స్పిన్ దిగ్గజం మరణానికి ముందు భయానక పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి...
‘రూమ్‌లో చాలా చోట్ల రక్తపు మరకలు ఉన్నాయి. వార్న్ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి, ఆయన కుటుంబ సభ్యులు సీపీఆర్ మొదలెట్టే సమయానికే తీవ్రమైన దగ్గుతో రక్తపు వాంతులు చేసుకుని మరణించినట్టు రిపోర్టులో తేలింది...’ అంటూ చెప్పుకొచ్చాడు లోకల్ పోలీస్ అధికారి సతిత్ పోల్‌పినిట్...
