అఫ్గనిస్తాన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ మహ్మద్ షెహజాద్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పదే పదే బోర్డు నియమాలను ఉల్లంఘిస్తున్నారని అభియోగాలు మోపిన అఫ్గన్ బోర్డు అతనిని నిరవధికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

గత నెలలో క్రమశిక్షణా నియమావళి సమావేశాలకు గైర్హాజరవ్వడంతో పాటు బోర్డు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడాన్ని పెద్దలు తీవ్రంగా పరిగణించారు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత షెహజాద్ ఫిట్‌గా లేడంటూ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.

అయితే తాను ఫిట్‌గానే ఉన్నప్పటికీ బోర్డు కావాలనే తనపై వేటు వేసిందని షెహజాద్ బహిరంగంగానే తన అక్కసును వెళ్లగక్కాడు. తన కెరీర్‌ను నాశనం చేసేందుకు తమ బోర్డులోని కొందరు కుట్ర పన్నారని ఆరోపించాడు.

కాగా.. తాజా సస్పెన్షన్‌తో షెహజాద్ క్రీడా జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించిన కారణంగానే అతనిపై వేటు వేసినట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.