అడిలైడ్: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతి చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు ట్వంటీ20 మ్యాచులో సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచులో రజిత నాలుగు ఓవర్లు వేసి 75 పరుగులు సమర్పించుకున్ాడు. అందులో ఓ నోబాల్ కూడా ఉంది. 

ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా భారీ పరుగులు ఇచ్చుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యంత చెత్త రికార్డు. ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ కూడా 70కి మించి పరుగులు ఇవ్వలేదు. రజిత 75 పరుగులు సమర్పించుకుని చేదు అనుభవాన్ని చవి చూశాడు. 

18.75 ఎకానమీతో రజిత శ్రీలంక ఐదో ఓవరులో 21 పరుగులు సమర్పించుకున్నాడు. పదో ఓవరులో 25 పరుగులు, 18వ ఓవరులో 18 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 233 పరుగులు చేసింది. 56 బంతుల్లో పది ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో డేవిడ్ వార్నర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

కెప్టెన్ ఆరోన్ ఫించ్ తో కలిసి వార్నర్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 122 పరుగులు చేసిన తర్వాత ఫించ్ అవుటయ్యాడు. ఆ తర్వాత మాక్స్ వెల్ 28 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. వీరిద్దరు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ ముగ్గురు బ్యాట్స్ మెన్ ధాటికి రజిత తన బౌలింగ్ లో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.