అంతర్జాతీయ క్రికెట్‌కు మరో దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు పలికాడు. నిలకడకు మారు పేరుగా నిలిచే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ హషీమా ఆమ్లా.. క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు.

దక్షిణాఫ్రికాకు ఆడటం గొప్ప గౌరవమని.. ఆటను ఎంతగానో ఆస్వాదించానని.. సుథీర్ఘ కెరీర్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని.. ఇంతకాలం తనకు మద్ధతుగా నిలిచిన కుటుంబానికి, స్నేహితులకు, తోటి ఆటగాళ్లకు, అభిమానులకు, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఆమ్లా కృతజ్ఞతలు తెలిపాడు.

36 ఏళ్ల హషీమ్ ఆమ్లా 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 124 టెస్టుల్లో 46.64 సగటుతో 9,282 పరుగులు చేశాడు. ఇందుల్లో 28 శతకాలున్నాయి. 181 వన్డేల్లో 8,113 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ అతని కెరీర్‌లో ఆఖరి వన్డే. అయితే టెస్టుల్లో, టీ20లలో సైతం ఆమ్లా చివరి మ్యాచ్ లంక‌పై ఆడటం విశేషం.

టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లానే. ఇంగ్లాండ్, భారత్, వెస్టిండీస్‌లపై అత్యధిక టెస్టు పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ అతనే. 2013లో టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా హషీమ్ ఆమ్లా రికార్డుల్లోకి ఎక్కాడు.