న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)పై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయలేదు. సిఏఏకు సంబంధించిన బిల్లును తాను పూర్తిగా చదవలేదని ఆయన చెప్పారు. దాంతోనే సరిపెట్టిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. 

సిఏఏకు వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. సోషల్ మీడియాలో దానిపై పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గుంగూలీ కూతరు సనా సిఏఏను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో ఆమెపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. 

దాంతో గంగూలీ రంగంలోకి దిగాడు. ఆ పోస్టులో వాస్తవం లేదని, సనా చిన్న పిల్ల కాబట్టి రాజకీయాల్లోకి లాగవద్దని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. దాంతో సీఏఏపై అబిప్రాయాన్ని ఎందుకు చెప్పడం లేదని నెటిజన్లు ఆయనను ఆడిగారు. 

ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో గంగూలీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాంతిని పాటించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలపై తాను మాట్లాడదలుచుకోలేదని, వాస్తవానికి బిల్లును తాను చదవలేదని, అందువల్ల అవగాహన లేకుండా ఆ విషయంపై మాట్లాడడం సబబు కాదని అన్నారు. 

అయితే, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని, ఆ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎవరు నష్టపోతారు అనే విషయాల గురించి చర్చ జరగాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడమే ముఖ్యమని అన్నారు.