ఆయన మృతి పై షేన్ వార్న్ మాజీ ప్రేయసి, మోడల్, నటి ఎలిజబెత్ హార్లీ స్పందించారు. ఆయన మృతి పై ఎమోషనల్ పోస్టుని ఆమె షేర్ చేశారు.
స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మృతి అందరినీ కలచివేసింది. కాగా.. ఆయన మృతి పై షేన్ వార్న్ మాజీ ప్రేయసి, మోడల్, నటి ఎలిజబెత్ హార్లీ స్పందించారు. ఆయన మృతి పై ఎమోషనల్ పోస్టుని ఆమె షేర్ చేశారు.
హర్లీ , వార్న్ సెప్టెంబరు 2011లో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ వారు డిసెంబరు 2013లో వారు విడిపోయారు. అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటున్నారు.
56 ఏళ్ల హర్లీ, శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేన్ వార్న్ తో కలిసి ఉన్న అనేక ఫోటోలను పోస్ట్ చేస్తూ, “సూర్యుడు ఎప్పటికీ మేఘం వెనుకకు వెళ్లిపోయినట్లు నేను భావిస్తున్నాను. RIP నా ప్రియమైన లయన్‌హార్ట్ @shanewarne23.” అంటూ షేర్ చేశారు.
ఆమె పోస్టు అందరి హార్ట్ టచ్ అయ్యేలా చేసింది. షేన్ వార్న్ మృతి చాలా బాధాకరం అంటూ అందరూ కామెంట్స్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా..హర్లీ కుమారుడు డామియన్ కూడా.. షేన్ వార్న్ మృతిపై ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడం గమనార్హం. అతను తనకు తండ్రిలాగా ఉన్నాడని డామియన్ పేర్కొన్నాడు. ఆయన మృతి తనను కలిచివేసిందని పేర్కొన్నాడు.
వార్న్‌కి చెందిన పలువురు ప్రముఖ స్నేహితులు కూడా దిగ్గజ క్రికెటర్‌కు నివాళులర్పించారు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాడు షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.
‘మిగతా వాళ్లలాగే నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. పొద్దున నిద్ర లేవగానే మెసేజ్‌లు వెల్లువెత్తాయి. నా కుమార్తెను పొద్దున్నే నెట్‌బాల్ ఆడటానికి తీసుకువెళ్లాలనే ప్లాన్‌తో గత రాత్రి నిద్రపోయాను. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. తనతో మడిపడిన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నా జీవితంలో తనొక భాగం’ అంటూ రికీ పాంటింగ్ పేర్కొనడం గమనార్హం.
