Asianet News TeluguAsianet News Telugu

IPL 2024 : రిషబ్ పంత్ కు షారుఖ్ ఆత్మీయ ఆలింగనం... వైజాగ్ స్టేడియంలో పండిన ఎమోషన్...

విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్, డిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఎమోషనల్ సంఘటన చోటుచేసుకుంది. అదేంటో మీరే చూడండి. 

Shah Rukh Khan Hugs DC Captain Rishabh Pant in Vizag ground AKP
Author
First Published Apr 4, 2024, 8:21 AM IST

విశాఖపట్నం : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. నిన్న(బుధవారం) విశాఖ వేదికగా జరిగిన కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ డిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు షారుఖ్ హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం మైదానంలో అడుగుపెట్టిన ఆయన కెకెఆర్ ఆటగాళ్లతోనే కాదు డిల్లీ ప్లేయర్స్ తో ఆత్మీయంగా మాట్లాడుతూ కనిపించారు. మరీముఖ్యంగా రిషబ్ పంత్ ఆటతీరుకు ముగ్దుడైన షారుఖ్ అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సీన్ అటు కెకెఆర్, ఇటు డిసి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది.  

కెకెఆర్ వర్సెస్ డిల్లీ మ్యాచ్ ను షారుఖ్ బాగా ఆస్వాదించారు. ఇరుజట్ల బ్యాటింగ్ సమయంలోనూ ఆయన హుషారుగా కేరింతలు కొడుతూ కనిపించారు. ముఖ్యంగా రిషబ్ పంత్ కళలుచెదిరే షాట్లతో కెకెఆర్ బౌలర్లపై విరుచుకుపడుతుంటే అతడిని అభినందించకుండా వుండలేకపోయారు. రిషబ్ బ్యాటింగ్ సమయంలో షారుఖ్ చప్పట్లు కొడుతూ కనిపించారు. 

ఇక  KKR VS DC మ్యాచ్ కోసం విశాఖపట్నం విచ్చేసిన షారుఖ్ ఖాన్ సందడి చేసారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న షారుఖ్ కు ఘనస్వాగతం లభించింది. షారుఖ్ ను చూసేందుకు అభిమానులు భారీగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేసి షారుఖ్ ను నోవాటెల్ కు తీసుకువెళ్లారు. నిన్న కెకెఆర్ వర్సెస్ డిసి మ్యాచ్ కు హాజరైన షారుఖ్ రాత్రి నోవాటెల్ లోనే బసచేసారు. ఇవాళ(గురువారం) కూడా విశాఖలోనే వుండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న షారుఖ్ సాయంత్రం ముంబైకి బయలుదేరనున్నారు.  

 

KKR Vs DC మ్యాచ్ విశేషాలు :  

తెలుగు గడ్డపై జరుగుతున్న ఐపిఎల్ మ్యాచులు క్రికెట్ ప్రియులకు పైసా వసూల్ మజాను అందిస్తున్నాయి. సరిగ్గా వారంరోజుల క్రితం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో పరుగుల వరద పారగా తాజాగా విశాఖలో అదే జరిగింది. కోల్ కతా,  డిల్లీ జట్లమధ్య జరిగిన మ్యాచ్ లో ఐపిఎల్ చరిత్రలోనే రెండో హయ్యెస్ట్ స్కోర్ నమోదయ్యింది. మొదట బ్యాటింగ్ కు దిగిన కెకెఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 272 పరుగులు చేసింది. సునీల్ నరైన్ డిల్లీ బౌలర్లను ఉతికారేస్తూ కేవలం 39 బంతుల్లోనే 85 పరుగులు చేసాడు. ఇక యంగ్ ప్లేయర్ రఘువంశీ కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రస్సెల్ 19 బంతుల్లో 41 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కెకెఆర్ డిసి ముందు 272 పరుగుల భారీ స్కోరు వుంచింది. 

అయితే భారీ లక్ష్యచేధనలో డిల్లీ కెపిటల్స్ తడబడింది. కెప్టెన్ రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ మాత్రమే కాస్త పోరాటం చేసారు.  పంత్ కేవలం 25 బంతుల్లో 55, స్టబ్స్ 32 బంతుల్లో 54 పరుగులతో ఆకట్టుకున్నారు.కొద్దిసేపు వీరిద్దరు మెరుపులు మెరిపించడమే డిసి అభిమానులకు ఊరటనిచ్చే అంశం. వీరి పోరాటంతో డిల్లీ కనీసం 166 పరుగులు చేయగలిగింది. 

 

రిషబ్ పంత్ ఎందుకంత స్పెషల్? 

టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ పంత్ చాలాకాలం హాస్పిటల్ కే పరిమితం అయ్యాడు.  అతడు ప్రాణాలతో బైటపడటమే గొప్పవిషయం... ఇక క్రికెట్ కెరీర్ లేనట్లేనని అందరూ భావించారు. కానీ ఎంతో పట్టుదలతో గాయంనుండి కోలుకుని తిరిగి బ్యాట్ పడ్డాడు పంత్. దీంతో అతడిని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. 

ఐపిఎల్ 2024 లో డిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు అందుకున్న రిషబ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇలా కెకెఆర్ తో మ్యాచ్ జట్టును గెలిపించలేకపోయినా తన బ్యాటింగ్ లో పస ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ప్రత్యర్థి టీం సహ యజమాని షారుఖ్ నుండి కూడా రిషబ్ ప్రశంసలు పొందాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios