ఐక్యరాజ్యసమితి వేదికన పర్యావరణ పరిరక్షణకై గళమెత్తిన గ్రెటా థన్‌బర్గ్ యావత్ ప్రపంచం నుండి ప్రశంసలు అందుకుంటోంది.  ఈ 16ఏళ్ల  బాలిక ఎలాంటి బెరుకు లేకుండా ప్రభుత్వాలు అభివృద్ది పేరుతో చేస్తున్న ప్రకృతి విద్వంసం గురించి ప్రశ్నించింది. ''హౌ డేర్ యూ'' అంటూ ఆమె చేసిన అద్భుత ప్రసంగం ఎంతమందిని కదిలించిందో తెలీదు కానీ టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మను మాత్రం కదిలించింది. దీంతో అతడు స్వీడన్ బాలికను ప్రశంసించకుండా వుండలేకపోయాడు. 

''భవిష్యత్ తరాలకు స్వచ్చమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత. ఈ విషయాన్ని గ్రెటా యావత్ ప్రపంచాన్ని ప్రశ్నించిన తీరు చాలా అద్భుతంగా వుంది. మన పిల్లలకు ప్రతిదీ స్వచ్చమైంది ఇవ్వాలనుకుంటాం. మరి వారికి ఉపయోగపడే ఈ వాతావరణాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాం. 

మన స్వార్థం కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తూ భవిష్యత్ తరాలకు అందకుండా చేస్తున్నాం. ఇకనైనా పర్యావరణాన్ని నాశనం చేయకుండా వుందాం. భవిష్యత్ తరాలకు స్వచ్చమైన భూమిని అందిందాం. మార్పు దిశగా అడుగులేద్దాం. ఈ విషయంలో గ్రెటాయే మనందరికి ఆదర్శం.'' అంటూ రోహిత్ ట్వీట్ చేశాడు.  

 స్వీడన్‌కు చెందిన గ్రేటా థన్‌బెర్గ్ ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులపై పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం అమెరికా వైట్‌హౌస్‌ ముందు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు‌లో ప్రపంచాధినేతలు మాట్లాడటానికి ముందు గ్రెటా మాట్లాడింది.

తాను ఈ రోజు ఇక్కడ ఉండాల్సిన దానిని కాదని స్కూల్లో చదువుకోవాల్సిందని, కానీ పరిస్ధితులు తనను ఇక్కడి వరకు తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు మా(భవిష్యత్ తరాల) కలలను కల్లలు చేశారని.. బాల్యాన్ని చిదిమేశారని, భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేశారంటూ మండిపడింది. మీ చర్యల కారణంగా పర్యావరణం నాశనమైపోతోందని...దీనిపై ప్రశ్నిస్తే డబ్బు, వృద్ధి అంటూ కథలు చెబుతున్నారు. హౌ డేర్ యూ(మీకెంత దైర్యం) అంటూ దేశాధినేతలను గ్రెటా కడిగిపారేసింది.