ముంబై: దీపావళి పోస్ట్ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు చిక్కులు తెచ్చి పెట్టింది. దేశవ్యాప్తంగా ఆదివారం ప్రజలు దీపావళి సంబరాలను టపాసులతో, దీపాలతో నిర్వహించుకున్న విషయం తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు ఈ దీపావళి ఉత్సవాలను జరుపుకుంటారు.

దీపావళి పండుగ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ రోహిత్ శర్మను చిక్కుల్లో పడేసింది. రోహిత్ శర్మ తాజాగా ఆ విషయంపై ఓ ట్వీట్ చేశాడు. దానిపై విమర్శల వర్షం కురుస్తోంది. దీపావళి రోజు టపాసులు కాల్చడం వల్ల వీధి కుక్కలు ఎంతో భయానికి గురవుతున్నాయని, వాటిని అలా చూడడం చాలా బాధేసిందని రోహిత్ శర్మ ట్వీట్ లో వ్యాఖ్యానించాడు 

నా తోటి భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో మరిన్ని వెలుగు నింపాలని కోరుకుంటున్నాను. ఈ దీపావళికి దీపాలు వెలిగిద్దాం. టపాసులు కాల్చే ముందు ఈ అమాయక ప్రాణులను దృష్టిలో పెట్టుకుందాం. అవి భయపడుతుంటే చూడడం బాధగా ఉంది అని రోహిత్ వ్యాఖ్యానిస్తూ ఓ కుక్క భయపడుతున్న వీడియోను షేర్ చేశాడు. 

రోహిత్ శర్మ ట్వీట్ పై విమర్శలు కురుస్తున్నాయి. రోహిత్ 2010లో టపాసులు కాలుస్తూ దీపావళి ఎంజాయ్ చేశాను అంటూ చేసిన ట్వీట్ ను షేర్ చేస్తున్నాైరు. ఈసారి కుక్కకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారా, మరి నూతన సంవత్సరం సమయంలో కుక్క ఇయర్ బిడ్స్ పెట్టుకుందా అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. 

ఇండియా మ్యాచ్ గెలిస్తే దీపావళి సందర్భంగా కన్నా ఎక్కువ టపాసులు కాలుస్తారు, కానీ మీకు దీపావళి సమయంలోనే అది గుర్తుకు వస్తుందని ఒక్కరు కామెంట్ చేశారు. నువ్వు ఐపిఎల్ ఆడకు, అందులోని ఈవెంట్లలో ఇంకా ఎక్కువ టపాసులు కాలుస్తారు అని మరొకరు వ్యాఖ్యానిం్చారు. అన్నా... నువ్వు ఐపిఎల్ గెలిచినప్పుడు ఆకాశాన్ని చూడవా అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఇంకా పలువురు రోహిత్ శర్మను తమ ట్వీట్లతో ఆడేసుకున్నారు.