Asianet News TeluguAsianet News Telugu

లెజెండ్స్ ఎవరో తేలేది నేడు... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్‌లో శ్రీలంకతో ఇండియా లెజెండ్స్ ఢీ...

సెమీ ఫైనల్ 2 మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌పై శ్రీలంక లెజెండ్స్ ఘన విజయం... నేడు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2 ఫైనల్‌లో ఇండియా లెజెండ్స్‌తో తలబడబోతున్న శ్రీలంక లెజెండ్స్..

Road Safety World series Season 2 Final match played between India Legends vs Sri Lanka Legends
Author
First Published Oct 1, 2022, 12:55 PM IST

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 సీజన్ ఫైనల్ స్టేజీకి చేరుకుంది. నేడు సీజన్ 2 ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌తో శ్రీలంక లెజెండ్స్ జట్టు తలబడబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2022 సీజన్‌ని ఆరంభించిన ఇండియా లెజెండ్స్ జట్టు ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు...

గ్రూప్ స్టేజీలో 5 మ్యాచుల్లో 2 మ్యాచుల్లో విజయాలు అందుకుంది ఇండియా లెజెండ్స్. మిగిలిన మూడు మ్యాచులు వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. అలాగే టేబుల్ టాపర్‌గా నిలిచిన శ్రీలంక లెజెండ్స్, గ్రూప్ స్టేజీలో 5 మ్యాచులు ఆడి 4 విజయాలు అందుకుంది. మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది...

మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ జట్టు, ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని ఫైనల్ చేరింది. మరో సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌పై 14 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది శ్రీలంక లెజెండ్స్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. మహేళ ఉడవట్టే 15 పరుగులు, సనత్ జయసూర్య 19 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ 7 పరుగులు చేసి నిరాశపరిచాడు...

ఉపుల్ తరంగ 3, చమరా సిల్వ 7 పరుగులు చేసి అవుట్ కాగా ఇషాన్ జయరత్నే 19 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. జీవన్ మెండిస్ 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి అవుట్ కాగా చతురంగ డి సిల్వ 11, గుణరత్నే 13, ఉదాన 16, కులశేఖర 8 పరుగులు చేశారు...

173 పరుగుల లక్ష్యఛేదనలో 11 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన బ్రియాన్ లారా, కులశేఖర బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. డ్వేన్ స్మిత్ 23, ఎరిక్ ఎడ్వర్డ్స్ డకౌట్ కాగా విలియం పెర్కెన్స్ 2,డంజా హ్యాట్ 17, జెరోమ్ టేలర్ 19, కిష్మర్ సంటోకీ 5 పరుగులు చేశారు.

నర్సింగ్ డియోనరైన్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు.  అయితే అతనికి అవతల ఎండ్‌ నుంచి ఎవ్వరూ సరైన సహకారం అందించకపోవడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది వెస్టిండీస్ లెజెండ్స్...

ఇండియా లెజెండ్స్ టీమ్‌లో నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అయితే తొలిసారి ఈ టోర్నీ ఆడుతున్న సురేష్ రైనా బ్యాటు నుంచి అభిమానులు ఆశిస్తున్న మెరుపులు అయితే ఇప్పటిదాకా రాలేదు. ఫైనల్ మ్యాచ్‌లో అయినా సురేష్ రైనాతో పాటు యువరాజ్ సింగ్ తమ మార్కు ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నారు అభిమానులు..

Follow Us:
Download App:
  • android
  • ios