Ranji trophy 2022: ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన యశ్ ధుల్... ఒడిస్సాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘన విజయం, రహానే అట్టర్ ఫ్లాప్...
అండర్ 19 ఆసియా కప్, అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచి, అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ ఇండియా కెప్టెన్ యశ్ ధుల్... రంజీ ట్రోఫీలో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన యశ్ ధుల్... ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు...
తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్ 9 వికెట్ల నష్టానికి 482 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అమన్‌దీప్ కారే 318 బంతుల్లో 18 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 156 పరుగులు చేయగా, శశాంక్ సింగ్ 177 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 122 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఢిల్లీ. నితీశ్ రాణా 152 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 71 పరుగులు చేయగా లలిత్ యాదవ్ 111 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేశాడు. ఫాలోఆన్ ఆడిన ఢిల్లీని ఓపెనర్లు భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు...
ధృవ్ షోరే 208 బంతుల్లో 13 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ కాగా యశ్ ధుల్ 261 బంతుల్లో 26 ఫోర్లతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నితీశ్ రాణా 36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసిన ఢిల్లీ, మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది...
తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బాబా ఇంద్రజిత్ 100 పరుగులు చేసి అవుట్ కాగా సాయి కిషోర్ 81 పరుగులు చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో జార్ఖండ్ 226 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ సౌరబ్ తివారి 58 పరుగులు చేయగా ఉత్కర్ష్ సింగ్ 52 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో తమిళనాడు 152 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇంద్రజిత్ 52 పరుగులు చేసినా మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ అతనికి సహకారం అందించలేదు.
214 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జార్ఖండ్, 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ సౌరబ్ తివారి 93, కుమార్ కుశార 50 పరుగులు చేసి ఆదుకున్నారు. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయినా 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది జార్ఖండ్...
ఒడిస్సాతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 108 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ముంబై. తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిస్సా 284 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 532/9 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పృథ్వీషా 53, అర్మాన్ జాఫర్ 125, సర్ఫరాజ్ ఖాన్ 181 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 165 పరుగులు చేసి అవుట్ కాగా అజింకా రహానే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకి ఆలౌట్ అయి, ముంబై చేతుల్లో చిత్తుగా ఓడింది ఒడిస్సా.
మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, అద్భుత విజయాన్ని అందుకుంది ఉత్తరప్రదేశ్. తొలి ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 462 పరుగులకి ఆలౌట్ కాగా ఉత్తరప్రదేశ్ 317 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది మహారాష్ట్ర...
357 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ అల్మాస్ శౌకత్ 100, కరణ్ శర్మ 116, రింకూ సింగ్ 60 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఉత్తరప్రదేశ్‌కి విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 67, రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి రింకూ సింగ్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ప్లేట్ గ్రూప్ టాపర్‌గా నిలిచిన నాగాలాండ్, ఎలైట్ గ్రూప్ హెచ్ టాపర్‌గా నిలిచిన జార్ఖండ్ మధ్య మార్చి 12 నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మిగిలిన ప్రీ క్వార్టర్, నాకౌట్ మ్యాచులన్నీ ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత జూన్ నెలలో జరుగుతాయి.
