కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ఐపీఎల్ పై కూడా పడనుంది. మరీ ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఊహించని షాక్ ఎదురైంది. ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో.. తాను ఐపీఎల్ టోర్నీ నుంచి దూరం కావాలని అనుకుంటున్నట్లు ఆ జట్టు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

తాను ఐపీఎల్ టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు అశ్విన్ ప్రకటించాడు. తన కుటుంబసభ్యులు కరోనాతో పోరాడుతున్నారని.. ఇలాంటి సమయంలో తాను ఐపీఎల్ ఆడలేనని ఆయన చెప్పడం గమనార్హం. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘నా కుటుంబసభ్యులు కరోనా తో పోరాడుతున్నారు. ఇలాంటి కష్ట కాలంలో నేను వారికి అండగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే ఈ ఐపీఎల్ సీజన్ కు రేపటి నుంచి విరామం తీసుకుంటున్నాను. పరిస్థితులు కుదుటపడిన తర్వాత.. నేను మళ్లీ ఆడేందుకు తిరిగి వస్తాను. థ్యాంక్యూ’ అంటూ అశ్విన్ ట్వీట్ లో వెల్లడించాడు.

కాగా.. అశ్విన్ ట్వీట్ పై ఢిల్లీ క్యాపిటల్స్ కూడా స్పందించింది. ఈ ఆపద సమయంలో అశ్విన్ కుటుంబానికి మా సహకారం ఉంటుంది. మీ కుటుంబసభ్యులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం అంటూ పేర్కొంది. ఇదిలా ఉండగా... ఆదివారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై సూపర్ ఓవర్ ద్వారా ఢిల్లీ విజయం సాధించింది.