Prithvi Shaw: జూనియర్ సెహ్వాగ్ అవుతున్న ఆటగాడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోకపోయినా దేశవాళీలో మాత్రం రెచ్చిపోతున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో రెచ్చిపోయిన పృథ్వీ షా.. తాజాగా సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అదరగొడుతున్నాడు. 

టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా దేశవాళీలో మెరుపులు మెరిపిస్తున్నాడు. అతడి ఆటతీరు చూసి జూనియర్ సెహ్వాగ్ అవుతాడని ప్రారంభంలో అందరూ భావించినట్టే.. షా దేశవాళీలో వీరవిహారం చేస్తున్నాడు. తాజాగా సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) - 2022లో సెంచరీతో మెరిశాడు. టీ20 ఫార్మాట్ లో జరుగుతున్న ఈ టోర్నీలో షా.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 46 బంతుల్లోనే సెంచరీ చేసి సెలక్టర్లు తనను ఎందుకు ఎంపిక చేయడం లేదనే చర్చను లేవనెత్తాడు.

స్మాట్ - 2022లో భాగంగా నేడు ముంబై - అసోం మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న షా.. మెరుపులతో అలరించాడు. 61 బంతుల్లోనే ఏకంగా 134 పరుగులు చేసి దుమ్ము దులిపాడు. టీ20లలో షాకు ఇది తొలి సెంచరీ. 

ఆది నుంచే మెరుపులు మెరిపించే షా.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. షా మెరుపులకు తోడు యశస్వి జైస్వాల్ (42), శివవ్ దూబే (17 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో ముంబై 3 వికెట్లకు 230 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అసోం.. 19.3 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో రజాకుద్దీన్ అహ్మద్ (39), రియాన్ పరాగ్ (28) ఫర్వాలేదనిపించారు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా షా సెంచరీ చేసిన తర్వాత ట్విటర్ లో నెటిజన్లు బీసీసీఐ పై ట్రోల్స్ కు దిగారు. ఇటువంటి ఆటగాడిని పక్కనపెడుతున్నందుకు బీసీసీఐ సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. మరికొందరు ఇది సెంచరీ కాదు.. బీసీసీఐ సెలక్టర్లకు షా పంపిన స్టేట్మెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు షా ను జట్టులోకి ఎంపిక చేయకుండా మోసం చేస్తారని మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన జట్టులో పృథ్వీ షా ను ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్టర్లు కచ్చితంగా కుమిలిపోతారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…