Asianet News TeluguAsianet News Telugu

బాగా ఆడుతున్నాడని సంతోషించేలోపు, గాయంతో అవుట్... పృథ్వీ షాకి గాయం, ఇంగ్లాండ్ నుంచి ఇంటికి..

4 మ్యాచుల్లో 143 యావరేజ్‌తో  429 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్న పృథ్వీ షా... మోచేతి గాయంతో టోర్నీ నుంచి అవుట్.. 

Prithvi Shaw ruled out of England domestic cricket series with serious knee Injury CRA
Author
First Published Aug 16, 2023, 5:17 PM IST

టీమిండియాలోకి సంచలనంలా దూసుకొచ్చిన పృథ్వీ షా, ఇప్పుడు బ్యాడ్ లక్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా తయారయ్యాడు.  ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన పృథ్వీ షా, ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశవాళీ వన్డే టోర్నీలో నార్తాంప్టన్‌షైర్ తరుపున ఆడుతున్నాడు. బాగా ఆడుతున్నాడు, ఇక మళ్లీ మనోడికి టైం వచ్చేసిందని అనుకునేలోపు, బ్యాడ్ లక్ వచ్చి లిప్ కిస్ పెట్టేసింది..  

నార్తాంప్టన్‌షైర్ జరిగిన మొదటి మ్యాచ్‌లో 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన పృథ్వీ షా, పుల్ షాట్‌కి ప్రయత్నించి హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సోమర్‌సెట్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు చేసి అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు పృథ్వీ షా.. ఆ తర్వాత డర్హం క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు చేసి అజేయ సెంచరీతో మ్యాచ్‌ని గెలిపించాడు..

4 మ్యాచుల్లో 143 యావరేజ్‌తో 152.67 స్ట్రైయిక్ రేటుతో 429 పరుగులు చేసిన పృథ్వీ షా, ప్రస్తుతానికి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. అయితే డర్హంతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా మోచేతికి గాయమైంది. స్కానింగ్‌లో ఈ గాయం తీవ్రమైనదిగా తేలడంతో ఇంగ్లాండ్ డొమిస్టిక్ వన్డే టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు పృథ్వీ షా..

‘అతి తక్కువ సమయంలో పృథ్వీ షా, ఈ క్లబ్‌లో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించాడు. అయితే గాయంతో అతను మిగిలిన మ్యాచుల్లో ఆడడం లేదు. పృథ్వీ షా ఎంతో వినయుడు, ఎంతో హుందాగా వ్యవహరించుకునే వ్యక్తి... నార్తాంప్టన్‌షైర్ క్లబ్ తరుపున ఆడినందుకు అతనికి ధన్యవాదాలు..

క్రీజులో అతను చూపించిన పర్ఫామెన్స్‌లు, డ్రెస్సింగ్‌ రూమ్‌లో అద్భుతమైన ప్రభావం చూపించాయి. ప్రతీ మ్యాచ్ గెలవాలని తాపత్రయపడే ప్లేయర్ అతను. అతను త్వరగా కోలుకుని, మళ్లీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాం..’ అంటూ నార్తాంప్టన్‌షైర్ క్లబ్ హెడ్ కోచ్ జాన్ సర్లడ్ స్టేట్‌మెంట్ ద్వారా తెలియచేశాడు...

బీసీసీఐ గైడెన్స్‌తో లండన్‌లోని స్పెషలిస్ట్ వైద్యులను కలిసిన పృథ్వీ షా, త్వరలో స్వదేశానికి తిరిగి రాబోతున్నాడు. ఇండియాకి వచ్చిన తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటాడు పృథ్వీ షా.. 

ఇదే టోర్నీలో ఆడుతున్న పృథ్వీ షా, 5 మ్యాచుల్లో 109.67 యావరేజ్‌తో 329 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 5లో ఉన్నాడు.  కౌంటీల్లో అదరగొడుతూ పృథ్వీ షా‌, టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని అభిమానుల్లో ఆశలు రేపాడు. అంతా బాగా జరుగుతుందని అనుకుంటున్న సమయంలోనే గాయంతో టీమ్‌కి దూరం కావడం... పృథ్వీ షా‌కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ అంటున్నారు నెటిజన్లు.  ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ స్వప్నా గిల్‌తో పృథ్వీ షా గొడవ పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios