Chetan Sharma Sting Operation: భారత క్రికెట్ జట్టు  చీఫ్  సెలక్టర్  చేతన్ శర్మ  స్టింగ్ ఆపరేషన్ తో అతడిపై వేటు తప్పదని   టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.  కానీ బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం.. 

భారత క్రికెట్ ను కుదుపునకు తోసేసిన చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ వీడియోతో అతడిపై వేటు తప్పదని అంతా భావిస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఓటమి తర్వాత చేతన్ ను తొలగించి తర్వాత అతడి మీద నమ్మకంతో మరోసారి బీసీసీఐ చేతన్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. కానీ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్.. భారత క్రికెట్ రహస్యాలన్నింటినీ బట్టబయలు చేయడంతో ఇక చేతన్ పై వేటు తప్పదని వాదనలు వినపడుతున్నాయి. కానీ బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం అతడికి మద్దతుగా నిలిచినట్టు తెలుస్తున్నది. 

బోర్డు వర్గాల సమాచారం మేరకు జీ స్టింగ్ ఆపరేషన్ అంతా ‘ప్రీ ప్లాన్డ్’గానే జరిగిందని చెప్పినట్టు తెలుస్తున్నది. చేతన్ పై వేటు సంగతి అటుంచితే అతడికి జై షా మద్దతుగా నిలుస్తున్నట్టు సమాచారం.

ఈ స్టింగ్ ఆపరేషన్ లో గంగూలీ-కోహ్లీ, బీసీసీఐ-కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ, హార్ధిక్ పాండ్యా, శుభమన్ గిల్, ఆటగాళ్ల ఫిట్నెస్ కు సంబంధించిన విషయాలపై చేతన్ సంచలన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో చేతన్ కు మూడిందనన్న వాదనలూ వినిపిస్తున్నాయి. చేతన్ వివాదంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ గానీ జై షా గానీ ఇంతవరకూ స్పందించలేదు. సున్నితమైన అంశం కావడంతో దీని గురించి మాట్లాడితే ఎటుపోయి ఎటు దారితీస్తుందోనని బోర్డు పెద్దలతో పాటు బీసీసీఐ సభ్యులు కూడా మీడియాకు దూరంగా ఉంటున్నారు. కానీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జై షా మాత్రం.. చేతన్ కు మద్దతుగా నిలిచినట్టు తెలుస్తున్నది. 

Scroll to load tweet…

వీడియోలో చేతన్.. ‘‘కోహ్లీ - గంగూలీ మధ్య విభేదాలు ఉండేవి. విరాట్ తాను బీసీసీఐ కంటే ఎక్కువ అని ఫీలయ్యేవాడు. కుంబ్లే కోచ్ గా తప్పుకున్నాక తిరిగి రవిశాస్త్రి టీమిండియా కోచ్ గా ఎంపిక కావడంలో అతడిదే కీలక పాత్ర. తొలుత టీ20 కెప్టెన్సీ నుంచి తాను వైదొలుగుతున్నానని చెప్పినప్పుడు మరోసారి ఆలోచించుకోవాలని దాదా చెప్పాడు. సమావేశంలో మేము 9 మంది ఉన్నాం. మరి గంగూలీ మాటలు కోహ్లీ విన్నాడో లేదో తెలియదు గానీ దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లేముందు ఈ వివాదంలో విలేకరులతో మాట్లాడుతూ కోహ్లీ అబద్దం చెప్పాడు. వాస్తవానికి కోహ్లీని కెప్టెన్ గా తప్పించాలనేది (వన్డేలకు) గంగూలీ నిర్ణయం కాదు. అది ఉమ్మడిగా తీసుకున్నదే. పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఒకడే సారథి ఉండాలని మేం కోహ్లీకి చెప్పాం. తనపై వేటు పడటానికి గంగూలీయే కారణమని కోహ్లీ భావించాడు’అని గంగూలీ-కోహ్లీ వివాదంపై మళ్లీ ఆజ్యం పోసిన విషయం తెలిసిందే.