ఈ నెలలో ప్రారంభంకానున్న ప్రపంచ కప్ మెగా టోర్నీ కోసం అన్ని జట్టు సిద్దమయ్యాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ఆయా దేశాలు ప్రకటించాయి.అంతేకాకుండా ఇండియాలో జరుగుతున్న ఐపిఎల్ నుండి ప్రపంచ కప్ ఆడే తమ ఆటగాళ్ళను వెనక్కి పిలిపించి మరీ ఈ మెగాటోర్నీకోసం సిద్దం చేస్తున్నారు. ఇలా అన్నిదేశాల్లో వన్డే వరల్డ్ కప్ ఫీవర్ స్టార్టయిన సమయంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన ప్రకటన చేశాడు. ప్రపంచ కప్ ఆల్ టైమ్ ఎలెవన్ పేరుతో ఓ జట్టును ప్రకటించి వివాదానికి తెరతీశాడు. 

అఫ్రిది అన్ని జట్ల నుండి దిగ్గజ ఆటగాళ్లను తీసుకుని వారితో ప్రపంచ కప్ ఆల్ టైమ్ ఎలెవన్ టీంను రూపొందించాడు. అయితే ఆ జట్టులో క్రికెట్ దిగ్గజాలకు సైతం చోటు కల్పించకుండా మొత్తం పాకిస్థాన్ ఆటగాళ్లతో నింపేశాడు. ఈ ప్రపంచ కప్ కు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్, ఒకప్పటి క్రికెట్ దిగ్గజం వెస్టిండిస్, శ్రీలంక, న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఈ జట్టులో అసలు చోటే లభించలేదు. 

ఇక భారత్ విషయానికి వస్తే ఒక్క విరాట్ కోహ్లీకి మాత్రమే ఈ జట్టులో చోటు కల్పించాడు. ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఓ సారి వన్డే వరల్డ్ కప్, మరోసారి టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు సాధించిపెట్టిన మాజీ కెప్టెన్, గేమ్ ఫినిషర్ ధోని లకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. అలాగే అంతర్జాతీయ వన్డేల్లో మూడు  డబుల్ సెంచరీలు బాదిన రోహిత్, దిగ్గజ క్రికెటర్ల నుండి ప్రపంచ స్థాయి బౌలర్ గా ప్రశంసించబడుతున్న బుమ్రాకు  కూడా అఫ్రిది జట్టులో చోటు దక్కలేదు. 

 దక్షిణాప్రికా నుండి కూడా కలిసి ఒకడిని మాత్రమే ఎంపికచేసుకున్నాడు. ఆస్ట్రేలియా నుండి ముగ్గురు మాజీ క్రికెటర్లకు చోటు దక్కింది. ఇక మిగతా జట్టు మొత్తం పాకిస్థాన్ ఆటగాళ్లతోనే నిండిపోయింది. దీంతో అభిమానులు దీన్ని ప్రపంచ కప్ ఎలెవన్ జట్టు అనేకంటే పాకిస్థాన్ ఎలెవన్ జట్టు అంటే బావుంటుందంటే సెటైర్లు వేస్తున్నారు.   

అఫ్రిదీ ఆల్‌టైం ప్రపంచ కప్ జట్టిదే...
 
సయీద్‌ అన్వర్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌, రికీ పాంటింగ్‌, విరాట్‌ కోహ్లి, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, జాక్వస్‌ కలీస్‌, వసీం అక్రమ్, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, షేన్‌వార్న్‌, షోయబ్‌ అక్తర్‌, సక్లైన్‌ ముస్తాక్‌