ఈసారైనా రియల్ బీన్‌ను పంపండి.. మా దగ్గర లేనోడిని ఎలా పంపమంటారు? జింబాబ్వే - పాక్ మ్యాచ్‌పై దేశాధినేతల ట్వీట్లు
T20 World Cup 2022: జింబాబ్వే-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు ‘మిస్టర్ బీన్’గురించిన చర్చ జరిగిన విషయం తెలిసిందే. రోవన్ అట్కీసన్ సృష్టించిన ‘మిస్టర్ బీన్’ క్యారెక్టర్ ను పాకిస్తాన్ మరోలా వాడటం జింబాబ్వే క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది.
జింబాబ్వే - పాకిస్తాన్ వేదికగా గురువారం పెర్త్ వేదికగా ముగిసిన పోరులో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీని కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సాధారణ క్రికెట్ అభిమానులకే కాదు.. ఏకంగా రెండు దేశాధినేతలనే ట్విటర్ లో పోటాపోటీ ట్వీట్స్ చేసుకునేంత క్రేజ్ సొంతం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మర్‌సన్ మ్నంగాగ్వా.. ఈసారైనా మీరు రియల్ మిస్టర్ బీన్ ను పంపండని పాకిస్తాన్ ప్రధానిని కోరాడు. దానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించాడు.
అసలేం జరిగిందంటే.. గురువారం నాటి మ్యాచ్ కు ముందు ‘మిస్టర్ బీన్’గురించిన చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ నటుడు, రచయిత రోవన్ అట్కీసన్ సృష్టించిన ‘మిస్టర్ బీన్’ క్యారెక్టర్ ను పాకిస్తాన్ మరోలా వాడటం జింబాబ్వే క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది.
12 ఏండ్ల క్రితం పాకిస్తాన్ కమెడీయన్ అసిఫ్ మహ్మద్.. 2016లో హరారే లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో హల్చల్ చేశాడు. పాక్ పంపిన నకిలీ మిస్టర్ బీన్‌కి జింబాబ్వే ప్రభుత్వం అధికారిక భద్రతా ఏర్పాట్లు చేసి వీధుల్లో ఊరేగించింది. వీడే అసలైన మిస్టర్ బీన్ అనుకుని, రాచ మర్యాదలతో సత్కరించింది. సన్మాన కార్యక్రమాలు నిర్వహించింది. మిస్టర్ బీన్ ను పోలిన వేషధారణతో జింబాబ్వేకు వెళ్లిన అసిఫ్ అక్కడి ప్రజలలో మిస్టర్ బీన్ మీద ఉన్న అభిమానాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తర్వాత జింబాబ్వే ప్రజలు పాకిస్తాన్ పేరు చెబితేనే అగ్గి మీద గుగ్గిల్లంలా మండుతున్నారు.
ఇక తాజాగా జింబాబ్వేతో మ్యాచ్ కు ముందు కూడా మిస్టర్ బీన్ చర్చలోకి రావడం.. మ్యాచ్ లో జింబాబ్వే ఒక్క పరుగుతో విక్టరీ కొట్టడంతో ఆ దేశ అధ్యక్షుడు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘జింబాబ్వే జట్టు చాలా బాగా ఆడింది. తర్వాత అయినా అసలైన మిస్టర్ బీన్ ను పంపండి..’ అని పాకిస్తాన్ కు చురకలంటించాడు. ఈ ట్వీట్ కు పాకిస్తాన్ ప్రధాని స్పందిస్తూ.. ‘మా దగ్గర రియల్ మిస్టర్ బీన్ లేడు. కానీ మా వద్ద నిజమైన క్రికెట్ స్ఫూర్తి ఉంది. ఇలాంటి టోర్నీలలో కింద పడ్డా తిరిగి పుంజుకునే ఫన్నీ హ్యాబిట్ (అలవాటు) మాకుంది. మిస్టర్ ప్రెసిడెంట్ (జింబాబ్వే అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ..) శుభాకాంక్షలు.. మీ టీమ్ ఈరోజు చాలా బాగా ఆడింది.’ అని రిప్లై ఇచ్చాడు.
జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్ కు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించడం గమనార్హం.. ‘హ హ హ.. జింబాబ్వే ప్రెసిడెంట్ కూడా జబర్దస్త్ గా ఆడాడు..’ అని ట్వీట్ చేశాడు.