ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో దాయాది పాక్ ను టీమిండియా ఘోరంగా ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ సత్తా చాటి చిరకాల ప్రత్యర్థి భారత్ ను ఓడిస్తుందనుకున్న ఆ దేశ అభిమానులకు నిరాశ తప్పలేదు. గత ప్రపంచ కప్ ల మాదిరిగానే ఈ మ్యాచ్ లో పాక్ ఓటమి తప్పలేదు. దీంతో నిరాశచెందిన అభిమానులు పాకిస్థాన్ జట్టు, ఆటగాళ్లపైనే కాదు పిసిబి, సెలెక్షన్ కమిటీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పిసిబి క్రికెట్ కమిటీ కమిటీ చీఫ్ మొహసీన్ అలీ రాజీనామా చేశాడు. అయితే ఈ రాజీనామాకు భారత్ చేతిలో పాక్ ఓటమికి గురవడమే కారణమని తెలుస్తోంది. 

తన రాజీనామాకు సంబంధించిన వివరాలకు సంబంధించి మొహసీన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.  '' పిసిబి క్రికెట్ కమిటీ చీఫ్ గా నన్ను నియమించిన పిసిబి  ఛైర్మన్ ఇషాన్ మణికి ఎప్పటికీ కృతజ్ఞతలు. నా సేవలు పాకిస్థాన్ క్రికెట్ కు ఎల్లపుడు అందుబాటులో వుంటాయి. నా సామర్థ్యాన్ని బట్టి పిసిబి ఎలా ఉపయోగించుకోవాలన్నా సహకరిస్తా'' అంటూ మొహసీన్ వెల్లడించాడు. 

మొహసీన్ ఖాన్ నిర్ణయాన్ని గౌరవించి రాజీనామాను ఆమోదిస్తున్నట్లు పిసిబి ఛైర్మన్ తెలియజేశారు. ఇంతకాలం పిసిబి క్రికెట్ కమిటీ  చీఫ్ గా సేవలందించిన అతడికి ధన్యవాదాలు తెలిపారు. అతడి సేవలను పాక్ క్రికెట్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఇషాన్ మణి పేర్కొన్నారు. 

అయితే మొహసీన్ రాజీనామాతో ఖాళీ  అయిత క్రికెట్ కమిటీ ఛైర్మన్ ఛీప్ పదవిలో పిసిబి మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ కు నియమించారు. అయితే మిగతా సభ్యులు వసీం అక్రం, మిస్బా ఉల్ హక్, ఉరూజ్ ముంతాజ్ లు యదావిధిగా కొనసాగుతారని పిసిబి ప్రకటించింది.