Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్‌ విజయాన్ని అడ్డుకున్న వరుణుడు... డ్రాగా ముగిసిన మాంచెస్టర్ టెస్టు! సిరీస్ ఆశలు మాయం..

వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన ఐదో రోజు ఆట... డ్రాగా ముగిసిన మాంచెస్టర్ టెస్టు... 2-1 ఆధిక్యంలో ఆస్ట్రేలియా... ఆఖరి టెస్టు గెలిచినా సిరీస్ దక్కించుకోలేని స్థితిలో ఇంగ్లాండ్.. 

Manchester Test ends as Drawn match, England team Ashes Series hopes goes vain CRA
Author
First Published Jul 23, 2023, 10:34 PM IST

గత యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో 4-0 తేడాతో ఓడిన ఇంగ్లాండ్, 2023 యాషెస్ సిరీస్‌ని సొంతం చేసుునే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. బజ్ బాల్ కాన్సెప్ట్‌ మీద నమ్మకంతో ఆవేశంతో తొలి టెస్టును డ్రా చేసిన ఇంగ్లాండ్, ఆ మ్యాచ్‌లో ఓడి రెండో టెస్టులోనూ పరాజయం పాలైంది. మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చినా... నాలుగో టెస్టులో వరుణుడు ఆతిథ్య జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు..

ఆసీస్‌పై భారీ ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్, దాదాపు విజయం ఖాయమనుకున్న సమయంలో వర్షం కారణంగా ఐదో రోజు ఒక్క బంతి కూడా వేయకుండా ఆట రద్దయ్యింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి టెస్టులో గెలిచినా, యాషెస్ సిరీస్ గెలవాలనే ఇంగ్లాండ్ కోరిక నెరవేరదు. 2-2 తేడాతో యాషెస్ సిరీస్ డ్రా చేయగలుగుతుంది. ఇదే జరిగితే 2022 ఏడాదిలో సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియాకే యాషెస్ దక్కుతుంది..

మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 90.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి 317 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మార్నస్ లబుషేన్ 51, మిచెల్ మార్ష్ 51 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 8, స్టీవ్ స్మిత్ 41, డేవిడ్ వార్నర్ 32 పరుగులు చేశారు...

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 107.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 592 పరుగుల భారీ స్కోరు చేసింది. జాక్ క్రావ్‌లే 189 పరుగులు చేయగా జో రూట్ 84, మొయిన్ ఆలీ 54, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 61 పరుగులు చేశారు. జానీ బెయిర్‌స్టో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కి 275 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. మార్నస్ లబుషేన్ 111 పరుగులతో సెంచరీ చేసి మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా ఇంకా ఇంగ్లాండ్ స్కోరుకి 61 పరుగులు వెనకబడి ఉంది...

దీంతో ఒక్క సెషన్ ఆట సాధ్యమైనా మ్యాచ్‌లో గెలవవచ్చిన ఇంగ్లాండ్, ఆఖరి సెషన్ వరకూ ఎదురుచూసింది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఐదో రోజు ఆటను రద్దు చేసిన అంపైర్లు, మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు...

ఇంతకుముందు 2021 ఇంగ్లాండ్ పర్యటనలో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయింది భారత జట్టు. ఆఖరి రోజు టీమిండియా విజయానికి 157 పరుగులు కావాల్సి రాగా చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. భారత జట్టు ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటుండగా వర్షం కారణంగా ఐదో రోజు ఒక్క బంతి కూడా వేయకుండానే ఆట రద్దు అయ్యింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మిగిలిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచిన భారత జట్టు, మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టుని భారత బృందంలో కరోనా కేసుల కారణంగా రద్దు చేసుకుంది. వాయిదా పడి ఏడాది తర్వాత ఐదో టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ సిరీస్‌ని 2-2 తేడాతో డ్రా చేయగలిగింది. అప్పుడు ఇంగ్లాండ్‌ని టెస్టు సిరీస్ ఓటమి నుంచి కాపాడిన వరుణుడు, ఇప్పుడు టెస్టు సిరీస్ గెలిచే సువర్ణావకాశాన్ని నాశనం చేశాడు.. 

యాషెస్ సిరీస్‌లో ఆఖరి టెస్టు జూలై 27 నుంచి కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios