Asianet News TeluguAsianet News Telugu

చెలరేగుతున్న ఎంగిడి.. సఫారీ బౌలింగ్‌కు టీమిండియా కుదేలు

T20 World Cup 2022:  వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న టీమిండియాను దక్షిణాఫ్రికా పేసర్లు  కోలుకోని దెబ్బకొడుతున్నారు. టాపార్డర్ తో పాటు మిడిలార్డర్ కూడా  కుదేలైంది.

Lungi Engidi Troubles Team India, top 5 Batters went to Pavilion Early
Author
First Published Oct 30, 2022, 5:30 PM IST

పెర్త్ వేదికగా జరుగుతున్న ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ లో  సఫారీ పేసర్లు అదరగొడుతున్నారు.  బౌలర్లకు అనుకూలిస్తున్న బౌన్సీ పిచ్ పై దక్షిణాఫ్రికా  వెటరన్ పేసర్ లుంగి ఎంగిడి చెలరేగుతున్నాడు.  అతడికి తోడు  అన్రిచ్ నోర్త్జ్ కూడా  జోరు కొనసాగిస్తుండటంతో భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు.  ఎంగిడి దాటికి టీమిండియా టాపార్డర్.. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,  హార్ధిక్ పాండ్యా  పెవిలియన్ కు చేరారు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న  దీపక్ హుడాను  నోర్త్జ్ దెబ్బతీశాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించింది. వరుసగా రెండు మ్యాచ్ లలో విఫలమైన కెఎల్ రాహుల్.. వేన్ పార్నెల్ వేసిన తొలి ఓవర్లో పరుగులేమీ చేయలేదు. తర్వాత ఓవ్లలో రోహిత్ (15) , రాహుల్ (9) లు చెరో సిక్సర్ కొట్టారు. 4 ఓవర్లకు టీమిండియా స్కోరు వికెట్ నష్టాపోకుండా 21 పరుగులు. 

కానీ ఐదో ఓవర్ వేసిన ఎంగిడి టీమిండియాకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.  ఆ ఓవర్లో రెండో బంతికి రోహిత్ శర్మ..  ఎంగిడికే క్యాచ్ ఇచ్చాడు.  చివరి బంతికి రాహుల్ కూడా స్లిప్స్ లో మార్క్రమ్ కు దొరికిపోయాడు.  తొలి పవర్ ప్లేలో భారత స్కోరు 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే. 

పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై వరుస హాఫ్ సెంచరీలతో  జోరు మీదున్న కోహ్లీ  (12)   రెండు ఫోర్లు కొట్టి  జోరు మీద కనిపించినా.. ఎంగిడి వేసిన తర్వాత ఏడో ఓవర్లో భారీ షాట్ ఆడబోయి లాంగ్ లెగ్ వద్ద రబాడాకు క్యాచ్ ఇచ్చాడు. 

 

అక్షర్ పటేల్ స్థానంలో ఈ మ్యాచ్ లో ఆడుతున్న దీపక్ హుడా (0) పరుగులేమీ చేయకుండానే నోర్త్జ్ వేసిన 8 ఓవర్ మూడో బంతికి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కు  క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లు పోతున్నా హార్ధిక్ పాండ్యా (2) ఉన్నాడనే ధైర్యం మీదున్న భారత అభిమానుల ఆశలపై ఎంగిడి మరోసారి నీళ్లు చల్లాడు. అతడు వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి రబాడా మరో అద్భుతమైన క్యాచ్ పట్టి అతడిని  పెవిలియన్ కు చేర్చాడు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది. 

పది ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు.. 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ (27*), దినేశ్ కార్తీక్  (2*) క్రీజులో ఉన్నారు. వీరి మీదే టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios